హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఒక గంటపాటు నిర్వహించే క్లీన్‌నెస్ డ్రైవ్ ”ఏక్ తారీక్, ఏక్ ఘంటా”లో ఎస్‌బిఐ ఉద్యోగులు భాగస్వామ్యం అయ్యారు. ఆదివారం తెలంగాణలోని ప్రతీ జిల్లాలో కనీసం 5 కేంద్రాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్ చేపట్టేలా చూసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని165కి పైగా ప్రాంతాల్లో స్వచ్ఛత డ్రైవ్‌ను నిర్వహించినట్లు ఆ సంస్థ పేర్కొంది. హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ నేతృత్వంలోని ఎస్‌బిఐ స్థానిక ప్రధాన కార్యాలయం, ఎస్‌బిఐ, ఎల్‌హెచ్‌ఒ, మెయిన్ బ్రాంచ్, ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్ హైదరాబాద్‌లోని ఉద్యోగులతో కలిసి ”ఎస్‌హెచ్‌ఎస్ 2023” ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఇఎన్‌టి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో ప్రజలు, ఖాతాదారుల కోసం పెట్ బాటిల్ రీసైక్లింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. స్వచ్ఛంద సేవకులైన ఉద్యోగులందరికీ గాంధీజీ చెప్పిన పరిశుభ్రత బాధ్యతలను ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్, జనరల్ మేనేజర్ నెట్‌వర్క్ 2 దేబాశిష్ మిత్ర, జనరల్ మేనేజర్ నెట్‌వర్క్ 1 మంజు శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్‌లు, బ్యాంక్ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.