– ఆరుబయటే విద్యార్థుల స్నానాలు
– భోజనానికి సరిపోయే వస్తువులున్నా ఉడికీ ఉడకని ఆహారం
– ఎప్పుడు కూలుతాయో తెలియని గదుల్లో విద్యార్థుల బస
నవతెలంగాణ-ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుండి ఎందరో విద్యార్థులు వచ్చి, మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతూ… వసతి గృహంలో ఉంటున్నారు. ప్రస్తుతం ఇందులో మొత్తం 77 మంది విద్యార్థులున్నారు. వసతి గృహంలోని ఒకటవ, ఐదవ నెంబర్ గల గదుల్లో మొత్తం పెచ్చులూడి, ఓ వైపు కుంగి పోయింది. జోరు వర్షం కురిసినప్పుడుపై కప్పు నుండి నీరు కారి, గదులన్ని నీటిమయమై, విద్యార్థులకు నిద్ర అనేదే ఉండదని తెలిపారు. పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు భయం గుప్పిట్లో బ్రతుకుతూ కాలం వెళ్ళదీస్తున్నారు. విద్యార్థులు బెడ్లపై నిద్రించి కిందకి దిగే క్రమంలో… అనేక సందర్భాల్లో ఫ్యాన్లు తలకు తగిలి ఎన్నోసార్లు తలకు గాయాలయ్యాయని తెలిపారు. ఇదిలా ఉంటె స్నానాల గదుల్లో నీరు రాకపోవడంతో విద్యార్థులందరు, సామూహికంగా ఆరుబయటే స్నానాలు ఆచరిస్తున్నారు. గత వారం పదిరోజుల నుండి ఒక్కడే వంట మనిషి ఉండడం వల్ల మెనూ ప్రకారం భోజనం అందించకపోగా, ఉడికిఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు. ఇద్దరు వంట మనుషుల్లో భీంరావ్ అనే అతను సెలవుపై ఇంటికి వెళ్ళగా, ప్రస్తుతం వారం రోజుల నుండి సత్యనారాయణ అనే వంట మనిషి విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణ మద్యం త్రాగి కిందపడిపోయి, దెబ్బలు తాకడంతో, హాస్టల్ లోని ఓ గదిలో పడుకుని ఉండిపోయాడు. ప్రస్తుతం అతని భార్య గత వారం రోజుల నుండి విద్యార్థులకు వంట చేస్తోంది.వండిన ఆహారం విద్యార్థులకు రుచించకపోవడంతో,అన్నం మొత్తం, ఉపయోగించని బాత్రూంలలో పడవేయడంతో ఆ ప్రాంతం దుర్గంధం వెదజల్లుతుంది. ఇంచార్జ్ హాస్టల్ వార్డెన్ తన ఇంటి సమస్యతో సెలవుపై వెళ్ళడంతో, విద్యార్థులకు ఇంకా ఇబ్బందిగా మారింది. విద్యార్థులు మాట్లాడుతూ… మా సమస్యలకు పరిష్కారం చూపాలని, వారి ఆవేదన వెళ్ళగక్కారు. ఇదిలా ఉంటె మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూర్భా భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మించలేదు.పాఠశాల నిర్మించిన సమయంలో లోపలి భాగంలో మట్టి నింపకపోవడంతో లోతు ఎక్కువగా ఉండడంతో, విద్యార్థులు అదుపు తప్పి అందులో పడే ప్రమాదం ఉందని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఊరికి దూరంగా పాఠశాల ఉండడంతో విద్యార్థులకు, ఉపాద్యాయినిలకు, అందులో పనిచేసే వారికి కోతుల బెడద ఎక్కువగా ఉందని తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే కోతుల బెడద తప్పుతుందని అన్నారు.