– లక్ష్యం నెరవేరే వరకు ఉద్యమంలో ముందుకు సాగాలి
– ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ
నవతెలంగాణ-ఓయూ
ఏడు దశాబ్దాలుగా దళితుల మధ్య పేరుకుపోయిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలనే చీకటిని తొలగించే అఖండ దీపమే ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీ య అధ్యక్షులు సి.యచ్. సోమశేఖర్ మాదిగలు అన్నారు. బుధవారం పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్‌లో ఓయూ మాదిగ విద్యార్థుల సదస్సు రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ అద్యక్షతన నిర్వహించారు.ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ. అంబేద్కర్ పవిత్రమైన లక్ష్యంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిస్తే, ఆ రిజర్వేషన్లు స్వతంత్ర భారత దేశంలో అన్ని కులాలకు అందలేదన్నారు. ఈ దేశాన్ని పాలించిన పాలకులు జనాభా ప్రాతిపదికన ఎస్సీలలోని అన్ని కులాలకు రిజర్వేషన్లు అందించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. అందుకే అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించి ఆ ఫలాలు అన్ని కులాలకు అందించాలనే లక్ష్యంతోనే మంద కృష్ణ మాదిగ నేతత్వంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ పోరాటం ఏ కులానికి వ్యతిరేకం కాదని అన్నారు. రాజ్యాంగం సమానత్వం కోరుతుందని అది సాధ్యం కావాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలన్నారు. అందుకోసం జరుగుతున్న పోరాటంలో పాల్గొనడం ప్రతి మాదిగ విద్యార్ధి బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత అంశం చివరి దశలో ఉందని, మాదిగ మరియు ఉప కులాల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాతి లక్ష్యం నెరవేరెంత వరకు ఉద్యమంలో ముందుకు సాగాలన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం అందరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ,జాతీయ కార్యదర్శి డా.పల్లేర్ల సుధాకర్ మాదిగ,జాతీయ ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామారపు శ్రీనివాస్ మాదిగ,కార్యదర్శి దుప్పెల్లి అనిల్ మాదిగ,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేశ్ మాదిగ,ప్రధాన కార్యదర్శి ధావు ఆదిత్య మాదిగ,ఉపాధ్యక్షులు మామిడి ప్రశాంత్ మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు.