ఎస్సీ జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి

-15 శాతం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను అమలుచేయాలి

– మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్) రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు
– నిజామాబాద్ జిల్లా కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
15 శాతం ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను ఎస్సీ జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి అని మాదిగ జాగృతి సంఘం (ఎం జె ఎస్) నిజామాబాద్ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 15% ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం ద్వారా కమీషన్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలని, 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్లను కేటాయించాలని సూచించారు. దీనివలన ఇప్పటివరకూ ఈ రిజర్వేషన్ల ఫలాలను తగు రీతిలో అనుభవించని కులాలకు, జనాభా ప్రాతిపదికన సూచించిన విధంగా వర్గీకరించి రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా భారత రాజ్యాంగ మూల సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లు అవుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రతినిధులు సంతోష్, బాగేంద్ర, రమేష్, సాయినాథ్, రాజు,వినోద్, సురేష్, గంగాధర్, రవి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.