నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి

– కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
దళితులపై, పేదల పైన దాడులు జరిగిన, హత్యలు జరిగిన, అత్యాచారాలు జరిగిన, వారి భూములు గుంజుకున్న చివరికి వారి స్మశానవాటికలను ఆక్రమించుకున్న పోలీసు యంత్రాంగానికి, అధికారులకు, పాలకు పట్టదాఅని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ప్రశ్నించారు. దళితుల, పేదల గోరీలు కూల్చి 25 రోజులు గడుస్తున్న ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం లేదని పోలీసులను ప్రశ్నించారు. ఒకసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని, జస్టిస్ పున్నయ్య గారి జీవోలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇప్పటికైనా నిందితులను అరెస్టు చేయకపోతే కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
శుక్రవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, బాధిత కుటుంబాలతో కలిసి పరిశీలన చేశారు. అనంతరం ఆగ్రామంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్కైలాబ్ బాబు పాల్గొని మాట్లాడుతూ తుక్కాపురం గ్రామంలోని సర్వే నెం.113లో 1- 20 గుంటల భూమిలో గ్రామం ఏర్పడ్డ నుండి గ్రామంలో ఎవరు చనిపోయిన ప్రధానంగా దళితులు చనిపోతే ఆ భూమిలో బొందలు పెట్టడం, కాల్చడం చేసిన తర్వాత ఆర్థిక స్తోమతను బట్టి గోరీలు కూడా నిర్మాణం చేసుకున్నారని అన్నారు. నాటి నుండి నేటి వరకు ఆ భూమి స్మశాన వాటిక అనే పేరుతోనే ఎవరు ఆ భూమి మీదికి రాలేదని అన్నారు. ఈనాడు భూముల ధరలు పెరగగానే ఆ భూమిని ఆక్రమించుకోవడానికి స్మశాన వాటిక పక్కనే భూమి కలిగిన కంఠం దయాకర్, కంఠం దినేష్ లు కుట్రపూరితంగా రాత్రికి రాత్రి జెసిబిలతో మొత్తం గోరీలను, బొందలను తవ్వి అతి దారుణంగా వాటన్నింటినీ బాయి బొందలో పోసి పూడ్చడం దారుణమని ఆవేదన వెలిబుచ్చారు. అనేకమంది తమ తల్లిదండ్రులు, తాత, ముత్తాతల ఆనవాలను లేకుండా చేశారని ఆవేదన చెందుతుంటె గ్రామ ప్రజలందరి సమస్యగా భావించి అధికారులు పోలీసులు వారికి అండగా ఉండవలసిన సమయంలో నిందితులను కాపాడుతున్నారని అన్నారు. ఒక దళితుని అవమానపరిచిన , తిట్టిన, తమ కుటుంబాలకు సంబంధించి గోరీలను తొలగించిన, అందులోకి లోకి రాకుండా అడ్డుకున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని భువనగిరి రూరల్ సిఐ గారికి తెలియకపోవడం చాలా దారుణమని, తెలిసికూడా అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం అన్యాయమని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, డిసిపి సంబంధించిన అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి గోరీలను కూల కొట్టిన నిందితులపై చర్యలు తీసుకొని ఆ స్మశాన వాటిక భూమి చుట్టూ కడీలుపాతి, చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేసి, స్మశాన వాటికకు రక్షణ కల్పించాలని లేనిచో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నర్సింహ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబ్బ లింగం, అన్నంపట్ల కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి గ్యార అశోక్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు, మాజీ సర్పంచులు నోముల మహేందర్ రెడ్డి, పుట్ట వీరేశం, మాజీ ఎంపిటిసి రాసాల మల్లేశం, నల్ల మాస సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుమేకల మహేష్, గ్రామ ప్రజలు జనగాం మహేష్, రత్నపురం వెంకటేష్, నల్లమాసు రవి, భువనగిరి నగేష్, రాచకొండ పాండు, కొల్లోజు వెంకటాచారి, వడ్లకొండ సుధాకర్ రెడ్డి, రత్నపురం శ్రీనివాస్, జనగాం అశోక్, పుట్ట కృష్ణ, కోళ్ల ఉప్పలయ్య, నల్ల మాస్ లక్ష్మమ్మ, గోపగోని కళమ్మ, రాసాల నీలమ్మ, నల్లమాస అండమ్మ, ఏదునూరి చంద్రపాల్, ఎదునూరి వెంకయ్య, ఏదునూరి రవి, జనగాం నరేష్, జనగాం రవి, జనగాం యాదయ్య లు పాల్గొన్నారు.