– రిజర్వేషన్ల రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నం
– కార్పొరేట్లకు కట్టుబానిసలుగా మార్చే కుట్ర
– ఓబీసీ లెక్కలు చారిత్రాత్మక అవసరం
– బీజేపీ వికృత క్రీడలో భాగమే 400 సీట్లు
– రిజర్వేషన్ల రద్దుపై మోడీ, అమిత్‌షా ఎందుకు స్పందించరు?
– కాంగ్రెస్ ఆస్తులు గుంజుకుం టుందంటూ దుష్ప్రచారం
– భార్య ఆస్తిని కూడా భర్త వాడుకునే అవకాశం లేదు
– బీజేపీ రిజర్వేషన్ల రద్దుపై బీఆర్‌ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలి
– రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయండి
– వాటిని రద్దు చేయాలంటే బీజేపీకి ఓటేయండి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రిజర్వేషన్ల రహిత భారత్ కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలపై ఆ పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా వారిని కార్పొరేట్లకు కట్టుబానిసలుగా మార్చబోతున్నదని హెచ్చరించారు. ఓబీసీ జనాభా లెక్కిస్తామంటేనే బీజేపీ భయపడుతో ందన్నారు. ఈవిషయంలో ప్రజలను తప్పుదోప పట్టించేందుకు కాంగ్రెస్ వస్తే ఆస్తులు గుంజుకుంటుందనీ, పుస్తెల తాళ్లు కూడా లాగేసుకుంటుందంటూ దుష్ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. భార్య ఆస్థిని భర్త వాడుకునే అవకాశం లేదని న్యాయశాస్త్రాలు చెబుతున్నాయని చెప్పారు. ఎవరి కష్టార్జితం వారిదేనన్నారు. రిజర్వేషన్ల రద్దు విషయంలో బీఆర్‌ఎస్ వైఖరేంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు సంపత్‌కుమార్, బెల్లయ్యనాయక్, రోహిన్‌రెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి సీఎం రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిందే కాంగ్రెస్ అన్నారు. 1978లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27శాతం ఇవ్వాలని సూచించిందన్నారు. ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా మండల్ కమిషన్ నివేదికను సమర్ధించిందన్నారు. రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా అమలు చేయాలని సూచించిందన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాహుల్ గాంధీకి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కుల గణన ఎక్స్‌రే లాంటిదని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కంకణం కట్టుకుందని విమర్శించారు. 2025లోగా రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మోడీ, అమిత్ షా లకు ఆదానీ, అంబానీ తొడయ్యారని ఎద్దేవా చేశారు. దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని తెలిపారు.
దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు
దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల వైపు వేగంగా ప్రయాణిస్తున్నదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌పై మోడీ, అమిత్ షా విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని వికృత రాజకీయ క్రీడకు తెర లేపారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ మనువాద సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేయాలని చూస్తోందన్నారు. అందుకే 400 సీట్లు కోరుకుంటున్నారని తెలిపారు. ‘ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్ అమెండ్‌మెంట్ యాక్ట్ వంటి వాటిని గత పదేండ్లుగా అమలు చేస్తున్నది’ అని తెలిపారు. రిజర్వేషన్లు రద్దు చేసి దళితులు, గిరిజనులు, ఓబీసీలను కార్పొరేట్ల ముందు కట్టు బానిసలుగా నిలబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీలా బీజేపీ వ్యవహరిస్తున్నదని తెలిపారు. జనాభా లెక్కిస్తేనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే వీలుంటుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయబోమనీ, రిజర్వేషన్లు పెంచుతామంటూ మోడీ, అమిత్‌షా ఎక్కడా మాట్లాడం లేదన్నారు. తమ ఆరోపణలపై ఎక్కడా స్పందించడంలేదన్నారు. బండి సంజరు, కిషన్ రెడ్డి మాత్రమే కాదు.. లెఫ్ట్ భావజాలం అని చెప్పుకునే ఈటల కూడా ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వాళ్ల పార్టీ విధానమేంటో వారికి స్పష్టంగా తెలుసనన్నారు. అందుకే వారు మాట్లాడటంలేదన్నారు. తప్పించుకోవాలన్న ఆలోచనే తప్ప.. ఇది తప్పని అమిత్ షా, మోడీతో చెప్పిస్తామంటూ ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ టార్గెట్ వంద రోజుల ప్రభుత్వమా? పదేండ్లుగా ప్రజలను దగా చేసిన బీజేపీయా?
కేసీఆర్ టార్గెట్ వంద రోజుల కాంగ్రెస్ ప్రభుత్వమా? పదేండ్లుగా ప్రజలను దగా చేసిన బీజేపీ ప్రభుత్వమా? చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేసీఆర్ అసలు ఈ విషయాన్నీ ప్రస్తావించడంలేదన్నారు. అమెరికా నుంచి అమలాపురం వరకు…చంద్ర మండలం నుంచి చింతమడక వరకు కేసీఆర్ అన్నీ మాట్లాడుతున్నారనీ, కానీ బీజేపీ చేసే కుట్ర గురించి మాత్రం మాట్లాడటంలేదని విమర్శించారు. గతంలోనే కేసీఆర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి మార్చేయాలన్నారని గుర్తుచేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ విధానంపై బీఆర్‌ఎస్ వైఖరేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తే మీ కార్యాచరణేంటో చెప్పాలని కోరారు. ‘వంద రోజుల మా ప్రభుత్వాన్ని దిగిపొమ్మంటూ బస్సుయాత్ర చేస్తున్నావు కదా…రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీపై నీ కార్యాచరణ ఎక్కడుంది? బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీతో ఒప్పందం చేసుకున్నారా? మల్కాజిగిరిలో బీజేపీ గెలుస్తుందంటూ మేడ్చల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాల్లారెడ్డి చెప్పడం ఇందుకు నిదర్శనం కాదా? నిజంగా బీజేపీతో వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలో నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ గెలుస్తుందని చెప్పిన ఎమ్మెల్యేను కేటీఆర్ సమర్ధించడం దేనికి సంకేతం?’ అని ప్రశ్నించారు.
బీజేపీకి ఐదు సీట్లు బీఆర్‌ఎస్ తాకట్టు
లోక్‌సభ ఎన్నికల్లో ఐదు పార్లమెంట్ స్థానాలను బీజేపీకి బీఆర్‌ఎస్ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్ ఆరోపించారు. గతంలో తనను ఎంపీగా ఓడించేందుకు 31 సమావేశాలు పెట్టిన కేటీఆర్… ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం ఒక్క సమావేశం పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా కేటీఆర్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు వ్యతిరేకంగా ఈటల మాట్లాడటం లేదన్నారు. పైగా భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలంటూ నాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘ఏందయ్యా రాజేందర్…నువ్వు ఏం మాట్లాడుతున్నావ్. కేసీఆర్, కేటీఆర్ భూములు అమ్మినప్పుడు రాజేందర్‌కు భూములు గుర్తు రాలేదా? కమిట్‌మెంట్‌తో మేం మాట్లాడుతుంటే, మాపై విమర్శలు చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయొద్దా? కేసీఆర్ చెప్పాలి. అమాయకంగానో, అత్యుత్సాహంతోనో మేడ్చల్ ఎమ్మెల్యే కుండ బద్దలు కొట్టారు. ఇక కేసీఆర్, కేటీఆర్ గుండు పగలగొట్టడమే మిగిలింది. కేసీఆర్‌కు ఇంత అసహనం ఎందుకు.అధికారం లేకపోతే ఊపిరి ఆగిపోతుందా? జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి సాక్షిగా మాట ఇస్తున్నా… ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతాం. తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా… రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి. వద్దనుకుంటే బీజేపీకి ఓటేయండి’ అని విజ్ఞప్తి చేశారు.