– కుటుంబానికి రూ.2.5 కోట్ల కుచ్చుటోపీ
– ‘ఎలక్టోరల్ బాండ్ల జారీ కోసం’ అంటూ వసూలు
– ఇద్దరిపై మాజీ న్యాయమూర్తి ఫిర్యాదు
– అందులో ఒకరు ఆరెస్సెస్‌లో ముఖ్యమైన వ్యక్తి అని ఆరోపణ
న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్ల పేరుతో ఇద్దరు స్కామర్లు మాజీ న్యాయమూర్తి డి.ఎస్.ఆర్. వర్మ కుటుంబాన్ని మోసం చేశారు. ‘కేంద్రంలోని పార్టీకి’ ఎలక్టోరల్ బాండ్ల జారీ కోసం వర్మ కుటుంబాన్ని మోసం చేసి రూ.2.5 కోట్లు వసూలు చేశారు. దీనిపై వర్మ హైదరాబాద్‌లో ఇద్దరు స్కామర్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ”మా బంధువులకు తెలిసిన వ్యక్తి అయిన నరేంద్రన్ నా వద్దకు వచ్చి కేంద్రంలోని పార్టీకి కొంత మొత్తాలు బాండ్ల ద్వారా ఇవ్వాలని కోరాడు. అతని మాటలు నమ్మి.. నా కుమార్తెలు, నా భార్య 2021 సంవత్సరంలో ఎప్పటికప్పుడు మొత్తం రూ. 2.5 కోట్లు బ్యాంక్ ద్వారా పంపారు” అని వర్మ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డి.ఎస్.ఆర్ వర్మ (72) ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టులలో పనిచేసిన రిటైర్డ్ జడ్జి.
వర్మ ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు తన అల్లుడికి తెలుసుననీ, వారు ఆరెస్సెస్‌లో ‘ముఖ్యమైన నాయకులు’ అని పేర్కొన్నారు. అనిల్ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో అతను వరల్డ్ హిందూ కాంగ్రెస్‌కు కోఆర్డినేటర్ అనీ, ఆరెస్సెస్‌తో సన్నిహితంగా పనిచేసే సంస్థ వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరమ్‌లో భాగమని ఒక ఆంగ్ల వార్త పత్రిక కథనం వెల్లడించింది. ఇచ్చిన డబ్బుతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తామనీ, దానికి బదులుగా ”తనను, తన మనవళ్లను యూఎస్‌లో మర్యాదగా ఉంచుతామని” స్కామర్లు పేర్కొన్నారని వర్మ తన ఫిర్యాదులో వివరించారు. రిటైర్డ్ జడ్జి తన ఇద్దరు మనవరాళ్ళు యూఎస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేశారని చెప్పారు.