ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలు

ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో మోసాలు– ఆరు నెలలు ఆగితే 30 శాతం రాబడి అంటూ గాలం
– ఇతర దేశాలకు బ్యాంక్‌ ఖాతాల వివరాలు
– ఐదుగరు సైబర్‌ నేరస్థుల అరెస్ట్‌
– రూ.8లక్షలు, 12 సెల్‌ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ సీజ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక రాబడిని పొందొచ్చని ట్రేడింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడున్న ఐదుగురు సైబర్‌ నేరస్థులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, రూ.8లక్షలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని పోలీస్‌ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ డి.కవితతో కలిసి జాయింట్‌ సీపీ ఏ.వి.రంగనాథ్‌ మీడియాకు వివరాలు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన స్వయం తిమానియా, మీట్‌ తిమానియా, బ్రిజీష్‌పటేల్‌, హర్షపాండ్యా, శంకర్‌లాలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని సైబర్‌ నేరాలను ఎంచుకున్నారు. ‘యూనిటీ స్టాక్‌’ కంపెనీ పేరిట(నకిలీ) వెబ్‌సైట్‌ నిర్వహించారు. తాము చెప్పిన విధంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో అధిక లాభాలొస్తాయని దేశవ్యాప్తంగా అమాయకులను టార్గెట్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా యూనిటీ ఎక్చేంజ్‌, టీ-20 వంటి గేమింగ్‌ వెబ్‌సైట్‌లలో సైతం డిపాజిట్‌ చేయాలని గాలం వేస్తున్నారు.
ఆరు నెలలు ఆగితే పెట్టిన పెట్టుబడికి 30 శాతం అధిక లాభాలొస్తాయని నమ్మిస్తున్నారు. స్కీంలో కొత్త వారిని చేర్పిస్తే అదనంగా కమీషన్లు ఇస్తామని ఆశ చూపిస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని గతేడాది నవంబర్‌లో టార్గెట్‌ చేసిన నిందితులు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే 100శాతం లాభాలను చూపిస్తామని నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు రూ.3,16,34,764ను వారు చెప్పిన వివిధ బ్యాంక్‌ ఖాతాలలో జమ చేశాడు. తీరా మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నిందితులు దుబారు, హాంకాంగ్‌తోపాటు ఇతర దేశాల్లో ఉన్న సైబర్‌ మోసగాళ్లకు బ్యాంక్‌ అకౌంట్లు సప్లరు చేస్తున్నారని గుర్తించారు. రోనక్‌ తన్నా అనే నిందితుడు వందలాది బ్యాంక్‌ ఖాతాలను సరఫరా చేసినట్టు తేలింది. మోసపూరితంగా సంపాదిస్తున్న డబ్బులను అలాంటి ఖాతాల్లో డిపాజిట్‌ చేయిస్తున్న నిందితులు తిరిగి ఆ డబ్బులను హవాలా రూపంలో భారతీయ ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తించారు.
టెలీగ్రామ్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు చేసుకోవద్దని జాయింట్‌ సీపీ సూచించారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులను ఆఫర్‌ చేస్తే స్పందించొద్దన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ మోసపూరితమన్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల విషయాన్ని షేర్‌ చేసుకోవద్దన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ శివ మారుతితోపాటు టీమ్‌మెంబర్స్‌ సీహెచ్‌ ఉనిల్‌ కుమార్‌, ఎం.జి.సుదర్శన్‌, బి.నరేష్‌, పి.అశోక్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.