– పెరగనున్న పాల ధరలు ?
న్యూఢిల్లీ : దేశంలో ఎండుగడ్డికి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. దీంతో పాల ధరలు పెరిగే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల్లో ఎండుగడ్డికి 25% నుండి 90% వరకూ కొరత ఉంటోంది. పశువుల సంఖ్య పెరగడం, గడ్డి లభించే విస్తీర్ణం తగ్గిపోవడం, పంట పొలాల్లో వరి కోతల తర్వాత అవశేషాలను తగలబెట్టడం వంటి కారణాలతో పశుగ్రాసానికి కొరత ఏర్పడుతోందని ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ (ఐజీఎఫ్‌ఆర్‌ఐ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో పాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశుగ్రాసం మరింత ఖరీదైపోయింది. గత సంవత్సరం నవంబరులో దేశంలో పాల సగటు చిల్లర ధర లీటరుకు రూ.54.90 ఉండగా ఈ సంవత్సరం నవంబరులో అది రూ.57.52కు పెరిగింది. పశుగ్రాసం లభించకపోవడం పాడి పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే పశు పోషణకు పెట్టే ఖర్చులో పశుగ్రాసం వాటా 70% వరకూ ఉంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో పచ్చిగడ్డికి 11.24%, ఎండుగడ్డికి 23.1 శాతం కొరత ఉంది.