భయపెడుతున్న నిరుద్యోగం

Scary unemployment– వేతనాలు తగ్గుతున్నాయి
– ఉద్యోగాల్లో కానరాని నాణ్యత
– స్వయం ఉపాధిని వెతుక్కుంటున్న ప్రజానీకం
– మోడీ పదేండ్ల పాలనలో సాధించిన ‘ప్రగతి’ ఇదే
న్యూఢిల్లీ : ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ఊదరగొట్టింది. ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయని, లక్ష్య సాధన కోసం వీటిపై దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పింది. అయితే బీజేపీ మాటలకు, దాని చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు. 2017-18లో దేశంలో నిరుద్యోగ రేటు 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా గరిష్టంగా 6.1%కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ సర్వే ప్రకారం ఈ రేటు 2020 ఏప్రిల్‌-జూన్‌లో…అంటే కోవిడ్‌ సమయంలో 20.8%కి చేరుకుంది. అయితే అది 2022-23 నాటికి 3.2%కి తగ్గడం కొంత ఊరట కలిగించే విషయం.
ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే నిరుద్యోగ రేటు బాగా ఎక్కువగా ఉన్నదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) అనే ప్రైవేటు సంస్థ తెలిపింది. ఈ సంస్థ నెలవారీగా సర్వేలు నిర్వహిస్తుంది. ఆర్థికవేత్తలు, విధానాలపై పరిశోధనలు చేసే వారు సీఎంఐఈ సమాచారం పైనే ఆధారపడుతుంటారు. ప్రభుత్వం వద్ద తగినంత సమాచారం సకాలంలో లభ్యం కాకపోవడమే దీనికి కారణం. ప్రతి ఏటా నిర్వహించే ఉద్యోగ-నిరుద్యోగ సర్వేను మోడీ ప్రభుత్వం 2017లో రద్దు చేసింది. అంతేకాదు…లేబర్‌ బ్యూరో అందించే త్రైమాసిక ఎంటర్‌ప్రైజ్‌ సర్వేను కూడా 2018 మార్చిలో నిలిపివేసింది.
ఉత్పత్తి రంగంలో తగ్గిన ఉపాధి
మోడీ ప్రభుత్వం 2014లో ‘మేకిన్‌ ఇండియా’, 2020లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాలు చేపట్టింది. కార్మికులకు ఉపాధి కల్పించే ఉత్పత్తి రంగానికి ఊతమివ్వడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం. అయితే కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 2016-2021 మధ్యకాలంలో ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు సగానికి సగం పడిపోయాయి. ఈ రంగంలో ఉపాధి కోవిడ్‌-19కి ముందున్న కాలం నాటికి తగ్గిపోయిందని విశ్లేషకులు తెలిపారు. ఉత్పత్తి రంగంలో లభించిన ఉద్యోగాల్లో చాలా వరకూ తక్కువ జీతంతో కూడుకున్నవే. ఆ తరహా ఉద్యోగాల వల్ల ఉత్పాదకతలో పెద్దగా మార్పు ఉండదు.
నిర్మాణ రంగంలో పెరుగుతున్న కార్మికులు
మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయని 2014 మ్యానిఫెస్టోలో బీజేపీ తెలిపింది. దేశంలోని కార్మికుల్లో 10.6 శాతం మంది మాత్రమే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఈ రంగం మౌలిక సదుపాయాలు, హౌసింగ్‌లో ఉద్యోగాలు కల్పిస్తుంది. పీరియాడికల్‌ లేబర్‌ ఫోర్స్‌ తాజా సర్వే ప్రకారం నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య 2022-23లో 13 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఏడు కోట్ల మందికి పైగా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 10 కోట్లకు చేరుతుందని అంచనా.
వ్యవసాయంలో ఉపాధి తప్పుడు సంకేతమే
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో సంప్రదాయక ఉపాధి మూలాలను పెంచడమే తన లక్ష్యమని 2014 నాటి బీజేపీ మేనిఫెస్టో చెప్పుకుంది. ఈ రంగంలో ఉపాధి పెరిగిన మాట వాస్తవమే. అయితే కోవిడ్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన వేలాది మంది పట్టణ, నగర వాసులు గ్రామాల బాట పట్టడమే దీనికి కారణం. వ్యవసాయ రంగంలో కార్మికుల సంఖ్య పెరగడం తప్పుడు సంకేతమని ఆర్థికవేత్తలు అంటున్నారు. 2004-05, 2011-12 మధ్యకాలంలో అంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయంలో కార్మికుల వాటా 58.5 శాతం నుంచి 48.9 శాతానికి తగ్గిపోయింది. ఆ తర్వాతి ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రేటు మరింత తగ్గి 2018-19లో 42.5 శాతానికి చేరింది. అయితే అప్పటి నుండీ అది పెరుగుతూ 2021-22లో 45.5 శాతానికి చేరుకుంది.
వేతనాల్లో వృద్ధి ఏది?
2014-15, 2021-22 మధ్యకాలంలో దేశంలోని కార్మికుల వేతనాలు (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) 1 శాతం కంటే తక్కువే పెరిగాయి. బీజేపీ మేనిఫెస్టో కేంద్రీకరించిన వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో వేతనాల పెరుగుదల 0.9 శాతం, 0.2 శాతం మాత్రమే. 2004-05, 2011-12 మధ్యకాలంలో, 2011-12, 2017-18 మధ్యకాలంలో ఆదాయ వృద్ధిని పోల్చుతూ ఓ పరిశోధనా పత్రం 2020లో ప్రచురితమైంది. దీని ప్రకారం 2011-12, 2017-18 మధ్యకాలంలో వేతనాల్లో వృద్ధి జరగలేదు. అంతేకాదు…అనేక ఉపాధి రంగాల్లో వేతనాలు తగ్గాయి కూడా. 2022-23లో గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ వేతన వృద్ధి తిరోగమనంలో ఉన్నదని ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంగీకరించింది.
స్వయం ఉపాధి బాటలో…
స్వయం ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు ఇది భిన్నంగా ఉంది. దేశంలోని కార్మికుల్లో స్వయం ఉపాధి పొందుతున్న వారు 2013-14లో 49.5 శాతం మంది ఉండగా 2022-23 నాటికి వారి సంఖ్య 57.3 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో నెలవారీ జీతాలు పొందుతున్న వారి సంఖ్య 23.1 శాతం నుంచి 20.9 శాతానికి తగ్గిపోయింది
ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం, సరైన ఉద్యోగాలు లభించకపోవడం వల్లనే అనేక మంది భారతీయులు స్వయం ఉపాధిని వెతుక్కుంటున్నారు.