ఆదిలాబాద్ లో పాఠశాలల బంద్ ప్రశాంతం

School closure in Adilabad is peacefulనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
వసతి గృహాలతో ప్రభుత్వ విద్యసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా నాయకుడు గణేష్ డిమాండ్ చేశారు. ఫుడ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం ప్రభుత్వ విద్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలో అక్కడక్కడ తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను జేఏసీ నాయకులు మూసివేయించారు. ప్రభుత్వ వసతిగృహాలు, విద్య సంస్థల్లో అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా నాసిరకమైన భోజనం అందిస్తున్నారని వామపక్ష విద్యార్థిసంఘాల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా నాయకుడు గణేష్ ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాంకిడి మండలంలో విద్యార్థి శైలజ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదుకోలేదన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.5.50 లక్షల నష్టపరిహారం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్ళీ ఇలాంటి  సంఘటనలు పునరావృతమైతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమం రూపొందించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొట్నక్ సక్కు, యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అల్తాఫ్, పిడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి దత్తు పీవైఎల్ జిల్లా నాయకులు మారుతి పాల్గొన్నారు.