రాత్రిపూట ఇల్లంతా చీకటి ఉన్నప్పుడు దొంగలు ప్రవేశించి బంగారము, నగదు దోచుకుని పోతారు. అందరూ పడుకున్న తర్వాత సైలెన్స్‌గా ఎవరికీ మేలుకువ రాకుండా, వచ్చి తమ పని పూర్తిచేసుకుని పోతారు. అట్లా వచ్చిన ఒక దొంగకు బీరువా తాళం తీసే దగ్గర ఒక నల్లని తేలు కాచుకొని కూచున్నది. ఈ దొంగను కాటేసింది. తేలు కాటేయగానే వెంటనే మంటపుట్టి సాధారణంగా అరుస్తుండాలి. కానీ అరుస్తే ఇంటి యజమాను లేస్తాడన్న భయంతో మంట ఉన్నా ఓర్చుకున్న సందర్భం. ఇట్లాంటి సందేశాలు వచ్చినప్పుడు ‘తేలు కుట్టిన దొంగలెక్కున్నడు’ చూడు అంటారు. లోపల మంట, బయట భయం. మరి కొన్నిచోట్ల దొంగనే దొంగతనం చేస్తాడు, ఎవరైనా చూడగానే ఆయనే దొంగ దొంగా అరుస్తూ పట్టుకోవడానికి పరిగెట్టినట్టు ఉరుకుతాడు. చూసేవాళ్ళు అనుకుంటారు కదా దొంగను పట్టుకుంటున్నాడు అని. ఈయన అత్యంత ఉషారు ఉన్న దొంగ. నిజానికి దొంగలంటే చాలా చురుకైన వాళ్లే ఉంటారు. అన్ని వత్తులకు నైపుణ్యత ఉన్నట్టే దొంగ వత్తికి కూడా అత్యంత నైపుణ్యత ఉండాలి. ఇట్లాంటి సందర్భం నుంచే ‘దొంగే దొంగ దొంగా అన్నట్టు’ సామెత పుట్టింది. ఇంటికొచ్చిన దొంగ బుద్ధి ఉన్న వాళ్లకు వెళ్లేటప్పుడు చెప్పలు తీసుకొని పోయినా లాభమే. వారికి కావలసింది రోజూ దొంగతనం చేయటమే. అందుకే దొంగకు చెప్పే లాభం అంటారు. చెప్పే లాభం అంటే చెప్పు అయినా లాభమే. పూర్వకాలంలో సంచార కుల వత్తులు ఉండేటివి. ఏ ఊరి వారి ఆ ఊరికి వెళ్లి తమ వత్తి చేసుకోవాలని నిబంధన ఉండేది. అనువత్తుల లాగానే దొంగలు కూడా ఆ ఊర్లను పంచుకునే సామెతనే ‘దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకోవడం’గా మారింది. ఏది ఏమైనా ‘దొరికితేనే దొంగ లేకుంటే దొర’ అనే సామెత కూడా ఉంది. దొంగతనం చేసిప్పుడు పోలీసులకు ఆనవాలు దొరికితేనే పట్టుకొని లోపల వేస్తారు. దొరకకుంటే భాజాప్తా దొర లెక్క తిరగవచ్చు. అవినీతి పనులు, లంచాలు తీసుకోవడం అందరూ చేస్తున్నారు. కానీ ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తేనే అవినీతిపరులుగా ముద్ర పడుతుంది. లేకుంటే లేదు. దొంగలు కూడా అంతే రాత్రి ఇంటికి కన్నం వేసి తెల్లవారి ఇంటి ముందు నుంచి నడిచిపోవచ్చు. అందుకే దొరికితేనే దొంగ…
– అన్నవరం దేవేందర్, 9440763479