స్కాట్లాండ్‌ మురిసె!

స్కాట్లాండ్‌ మురిసె!– నమీబియాపై 5 వికెట్లతో గెలుపు
– మైకల్‌ లీస్క్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
– నమీబియా 155/9, స్కాట్లాండ్‌ 157/5
స్కాట్లాండ్‌ మురిసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం సాధించింది. గ్రూప్‌-బిలో తొలి మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌, ఇంగ్లాండ్‌లను వెనక్కి నెట్టి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నమీబియా తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేయగా.. 18.3 ఓవర్లలోనే స్కాట్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
మైకల్‌ లీస్క్‌ (35, 17 బంతుల్లో 4 సిక్స్‌లు), (1/16) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగాడు. తొలుత బంతితో ఆకట్టుకున్న మైకల్‌ లీస్క్‌.. ఛేదనలో బ్యాట్‌తో గెలుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. మైకల్‌ మెరుపు ప్రదర్శనతో గ్రూప్‌-బిలో నమీబియాపై స్కాట్లాండ్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల ఛేదనలో స్కాట్లాండ్‌ బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఓపెనర్‌ మైకల్‌ జోన్స్‌ (26, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రిచీ బెరింగ్టన్‌ (47 నాటౌట్‌, 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన స్కాట్లాండ్‌ మెరుపు విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. అంతకుముందు, నమీబియా తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. గెరార్డ్‌ ఎరాస్మస్‌ (52, 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. స్కాట్లాండ్‌ స్టార్‌ మైకల్‌ లీస్క్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
మైకల్‌ మెరువగా.. : స్కాట్లాండ్‌ లక్ష్యం 156 పరుగులు. బ్రిడ్జ్‌టౌన్‌లో స్లో పిచ్‌పై ఈ లక్ష్య ఛేదన కష్టమే. తొలి పది ఓవర్లలో మూడు వికెట్లు చేజార్చుకున్న స్కాట్లాండ్‌… మ్యాచ్‌పై పట్టు బిగించలేదు. జార్జ్‌ మున్సె (7), మైకల్‌ జోన్స్‌ (26), బ్రాండన్‌ మెక్‌ములన్‌ (19)లు ఆరంభంలో మెప్పించారు. రిచీ బెరింగ్టన్‌ (47 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. మాథ్యూ క్రాస్‌ (3) నిరాశపరిచినా మైకల్‌ లీస్క్‌ (35) తోడుగా స్కాట్లాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. బెరింగ్టన్‌, మైకల్‌ జోడీ 42 బంతుల్లోనే 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నమీబియా ఆశలను ఆవిరి చేసింది. ఆఖర్లో మైకల్‌ నిష్క్రమించినా.. క్రిస్‌ (4 నాటౌట్‌) తోడుగా బెరింగ్టన్‌ లాంఛనం పూర్తి చేశాడు. నమీబియా బౌలర్లలో ఎరాస్మస్‌ (2/29), రూబెన్‌ (1/36), బెర్నార్డ్‌ (1/20) రాణించారు.
ఎరాస్మస్‌ షో : టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న నమీబియా మంచి స్కోరు సాధించింది. ఓపెనర్‌ కోట్జే (0) నిరాశపరిచినా.. నికోలస్‌ డావిన్‌ (20), జాన్‌ ఫ్రైలింక్‌ (12) రాణించారు. మిడిల్‌ ఆర్డర్‌లో గెరార్డ్‌ ఎరాస్మస్‌ (52) అర్థ శతక ఇన్నింగ్స్‌తో నమీబియాను ఆదుకున్నాడు. జేన్‌ గ్రీన్‌ (28, 27 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), డెవిడ్‌ వైసీ (14), స్మిత్‌ (11) విలువైన పరుగులు జోడించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ వీల్‌ (3/33), బ్రాడ్‌ (2/16)లు వికెట్ల వేటలో మెప్పించారు.