”స్కొటోమా” అన్నాడు సుదర్శన్, పేషెంటును పరీక్షించడం పూర్తి చేశాక.
”అది పెద్ద జబ్బా డాక్టర్?” అని అడిగాడు ఆచార్య, ఆందోళనగా. బుర్ర గిరగిరా తిరిగి, పడిపోబోయాడు కానీ ఎలాగో సంబాళించుకున్నాడు.
”కారణం తెలిస్తే తప్ప కచ్చితంగా చెప్పలేను” అన్నాడు డాక్టర్.
”స్కొటోమా అంటున్నారు కదా?” అడగాలా వద్దా అనుకుంటూ, సందేహంగానే అడిగాడు ఆచార్య. అడగకపోతే ఎన్ని నిద్ర లేని రాత్రులు గడపాలో అని మనసు పీచుపీచుమంటోంది మరి!
”స్కొటోమా అన్నది వ్యాధి పేరు కాదు, అది మీకున్న కంప్లెయింట్ పేరు. దగ్గు కూడా అంతే. క్షయ, ఉబ్బసం, అలర్జీ, న్యుమోనియా, లంగ్ క్యాన్సర్ మొదలైన ఎన్నో వ్యాధులలో దగ్గు ఒక కంప్లెయింట్ గా ఉంటుంది”
అది కన్సల్టేషన్ రూం. సుదర్శన్ కళ్ల డాక్టరు. ఆచార్య పేషెంటు. అతడు హైస్కూల్లో క్రాఫ్ట్‌టీచర్‌గా పనిచేసి రిటైరయ్యాడు. కొన్ని నెలలుగా ఆచార్యకు తన చూపులో తేడా వచ్చినట్టు తెలుస్తోంది. దృష్టిక్షేత్రంలోని అంచులలో ఏమీ కనిపించడం లేదు. మధ్యభాగంలో ఉన్నవి మాత్రమే ఓ మోస్తరుగా కనిపిస్తున్నాయి, గొట్టంలోంచి చూస్తే కనిపించినట్టు. దాన్నే స్కొటోమా అంటారని డాక్టరు చెప్పాడు. గ్లాకోమా, మధుమేహం, పక్షవాతం మొదలైన వ్యాధులలో అది కంప్లెయింట్‌గా ఉంటుందన్నాడు. ఆచార్యకు గాబరా మొదలైంది. మరికొన్ని పరీక్షలు చేస్తే తప్ప మూలకారణం ఏమిటో చెప్పలేనన్నాడు డాక్టర్ సుదర్శన్.
ఆగస్టు పదిహేను సందర్భంగా వివిధ రంగాలలోని కళాకారులకు బహుమతులివ్వాలని నిర్ణయించారు జిల్లా కలెక్టర్ గారు. చేతిపనుల పోటీలలో ఆచార్య పూర్వం కొన్ని రాష్ట్రస్థాయి బహుమతులు గెల్చుకుని ఉన్నాడు. అతనికి అందులో బాగా పేరు కూడా వచ్చింది కాబట్టి, ఆ విభాగానికి ఆయననే ప్రధాన న్యాయనిర్ణేతగా నియమించాడు జిల్లా విద్యాధికారి. ఉద్యోగంలో ఉన్నవారికే ఆ బాధ్యతనివ్వాలనే నియమం ఏమీ లేదు. ఎంపిక కోసం జిల్లాలోని కళాకారులందరినీ లెక్కలోకి తీసుకోవాలని నిర్ణయింపబడింది.
”మన జిల్లాలో చేతిపనులలో నైపుణ్యం ఉన్నవారు సుమారు అందరూ మనకు తెలుసు కదా సార్. ఎవరెవరికి ఎంత ప్రతిభ ఉందో కూడా తెలుసేనాయె. వారిలోంచి యోగ్యుడైన వ్యక్తికి బహుమతిని ప్రకటిస్తే బాగుంటుందనుకుంటాను” అని సలహా ఇచ్చాడు ఒక క్రాఫ్ట్ టీచర్. కానీ ఆచార్య మనసు అందుకు ఒప్పుకోలేదు. తనది భిన్నమైన, అసాధారణమైన మనసు కదా మరి!? అందుకే ఎంపికలో ఒక కొత్తపద్ధతిని ప్రవేశపెట్టి, సంచలనాన్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం ఆయన ప్రతిపాదించిన విధానం ఇది: తను ఏ స్కూల్లో ఐతే రిటైరయ్యాడో అందులోని ఒక హాలులోకి కళాకారులు వచ్చి, తాము చేసిన వస్తువును పట్టుకుని, స్టాండుకు కట్టబడిన ఒక గొట్టం ముందు నిలబడాలి. ఆ గొట్టంలోంచి చూసి, ఆ వస్తువు కళాత్మకతను అంచనా వేస్తాడు ఆచార్య!
తాము చేసిన వస్తువులను పట్టుకుని చాలా మంది వచ్చారు ఆ స్కూలుకు. వారిలో ఎంతోమంది కొత్తవారు కూడా ఉన్నారు. వాళ్లు బహుశా ఈమధ్యనే వలస వచ్చి స్థిరపడినవారై ఉండాలి. గొట్టం ఒక భంగిమలో స్టాండుకు గట్టిగా కట్టివుంది కనుక, దాన్ని కొంచెం కూడా కదిపేందుకు వీలు లేదు. హాలు అభ్యర్థులతో నిండిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి గొట్టం ముందు నిలబడి, తాము చేసిన వస్తువులను చూపిస్తుంటే ఆ గొట్టంలోంచి చూస్తూ, వాటిని పరీక్షిస్తున్నాడు ఆచార్య. మధ్యాహ్నం ఒంటిగంట దాటిపోయింది. వచ్చినవాళ్లు ఆకలితో నకనకలాడుతున్నారు. ఆలస్యం అవుతుండటంతో అందరూ విసుక్కుంటున్నారు. చాలామంది అరుస్తూ నిరసన తెలిపారు.
”సార్, ఒక్కొక్క అభ్యర్థి పట్టుకున్న వస్తువును చూసేవిధంగా మనమే గొట్టాన్ని అన్ని దిక్కుల్లో తిప్పితే సెలెక్షన్ తొందరగా ఐపోతుంది” అని సలహా ఇచ్చాడు ఆ స్కూలు క్రాఫ్ట్ టీచర్.
”వీల్లేదు. బహుమతి ఊరికే వస్తుందా? ఒకరి తర్వాత ఒకరు వచ్చి గొట్టం ముందు నిలబడాల్సిందే. తమ ముఖాన్ని కూడా స్పష్టగా చూపించాలి” అన్నాడు ఆచార్య. ప్రధాన న్యాయనిర్ణేత ఐన ఆచార్యను గట్టిగా ఖండించే ధైర్యం లేక, నోరు మూసుకున్నాడు ఆ క్రాఫ్ట్ టీచర్.
అలా పోయి గొట్టం ముందు నిలబడటం చాలామందికి నచ్చలేదు. పైగా ఈ తతంగానికి చాలా సమయం పడుతుండటం వలన, ”మాకు ఏ బహుమతీ అవసరం లేదు” అంటూ వెళ్లిపోయారు.
”పోతే పోనీయండి. నేను పెట్టిన నియమానికి తలొగ్గకపోతే నష్టపోయేది వాళ్లే” అన్నాడు ఆచార్య రోషంతో. ఆ విధంగా ఎంపిక కార్యక్రమం ముగిసింది.
వారం రోజుల తర్వాత డాక్టర్ సుదర్శన్‌ను సంప్రదించాడు ఆచార్య. తను చాలా నెలలుగా దృష్టి సమస్యతో బాధ పడుతున్నా ఎంతో ఆలస్యంగా డాక్టరును కలిసినందుకు తనను తానే తిట్టుకున్నాడు!
– ఎలనాగ