లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలీంల ప్రదర్శన

– చట్టాలపై అవగాహనను పెంపొందిస్తాయని కలెక్టర్ వెల్లడి
– పాల్గొన్న జిల్లా జడ్జి, పోలీస్ కమిషనర్
నవతెలంగాణ – కంటేశ్వర్
న్యాయ సేవాధికార సంస్థ పనితీరును వివరిస్తూ, చట్టాలపై ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు, అన్యాయాలు, మోసాలకు గురైన సందర్భాలలో న్యాయ సహాయం ఎలా పొందాలనే అంశాలను వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిలింలను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉషామయూరి మల్టిప్లెక్స్ థియేటర్ లో ప్రదర్శించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేయగా, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఇతర అధికారులు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, వివిధ వర్గాల వారు పాల్గొని ఎంతో ఆసక్తిగా షార్ట్ ఫిలిం లను తిలకించారు. చిన్నారుల పట్ల లైంగిక నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద అమలయ్యే కఠిన శిక్షలు, బాధితులు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఏ విధంగా సహాయం పొందవచ్చు అనే అంశాలతో కూడిన షార్ట్ ఫిలిం అందరినీ ఆలోచింపజేసింది. అదేవిధంగా సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మానసిక రుగ్మతలకు సరైన చికిత్స చేయించకుండా మూఢ నమ్మకాలతో ముడిపెట్టడం, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలను ఎంతో అర్ధవంతంగా స్పృశిస్తూ సీత కథ, వల, ముందడుగు, గెలుపు, మలుపు, మనో వ్యాధి, జోజో పాపాయి శీర్షికలతో రూపొందించిన తక్కువ నిడివి కలిగిన ఫిలింలు అయినప్పటికీ ఆలోచింపజేశాయి. ముఖ్యంగా పై సందర్భాలలో అన్యాయాలు, మోసాలకు గురయ్యే వారికి లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందిస్తున్న సేవల గురించి అర్ధమయ్యే రీతిలో షార్ట్ ఫిలింల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సామాజిక స్పృహతో వివిధ వర్గాల వారిని చైతన్యపరిచేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అభినందించారు. ఇదే కోవలో ఆయా చట్టాల పట్ల, నేటి సమాజంలో పెచ్చుమీరిన సైబర్ నేరాలు, చిన్నారులపై లైంగిక దాడులు వంటి వాటి గురించి ప్రజలను జాగృతపర్చేందుకు, సహాయం పొందే మార్గాల గురించి షార్ట్ ఫిలింల ద్వారా వివరించే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణ దిశగా, చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే సదుద్ద్యేశంతో రూపొందించిన ఈ షార్ట్ ఫిలింలను ప్రజలందరికి చేరేవిధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడమే కాకుండా అన్ని థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లా జడ్జి సునీతా కుంచాల మాట్లాడుతూ, న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన షార్ట్ ఫిలిం ప్రదర్శనను రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంఛనంగా ప్రారంభించగా, ప్రాంతీయ స్థాయిలో మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాలోనే వీటిని విడుదల చేయడం జరుగుతోందన్నారు. నేర రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా, చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, అన్యాయాలకు గురైన సందర్భాలలో బాధితులు మనోధైర్యం కోల్పోకుండా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఏ మేరకు సహాయం పొందవచ్చు అనే అంశాలను తెలియజేస్తూ రూపొందించిన షార్ట్ ఫిలింలు అవగాహన పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. వీటి నిర్మాణానికి సహకరించిన వారందరికీ డీఎస్ఎల్ఏ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేటి సమాజంలో డిజిటల్ నేరాలు పెరిగిపోయాయని, వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేలా షార్ట్ ఫిలిం రూపొందించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. బాలలు, చిన్నారులపై నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశాలను చక్కగా వివరించారని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపోహలను దూరం చేసుకుని అవగాహన ఏర్పర్చుకునేందుకు ఇలాంటి షార్ట్ ఫిలింలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్జి పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి, షార్ట్ ఫిలింలకు దర్శకత్వం వహించిన సాయిప్రసాద్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.