ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ అభ్యర్థులకు 7న ధ్రువపత్రాల పరిశీలన

– టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వ్యాధి నిరోధక ఔషధ సంస్థ ప్రజారోగ్యం, ల్యాబోరేటరీస్‌, ఫుడ్‌ (హెల్త్‌) పరిపాలన శాఖ పరిధిలో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వచ్చేనెల ఏడో తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వచ్చేనెల ఏడో తేదీన ఉదయం 10.30 గంటలకు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందని తెలిపారు. ఎవరైనా గైర్హాజరైతే అదేనెల ఎనిమిదో తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌ లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అవసరమైన ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు రెండు జతల జిరాక్స్‌ ప్రతులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించబోమని స్పష్టం చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులు తదుపరి ప్రక్రియలో అనర్హులవుతారని తెలిపారు. వచ్చేనెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ నుంచి వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముందని వివరించారు. ఇతర వివరాల కోసం http://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2022, జులై 21న టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.