14 నుంచి హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన

– టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్‌, మ్యాట్రన్‌, మహిళా సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 14 నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం సాధారణ అభ్యర్థులు 1:2 నిష్పత్తిలో, వికలాంగులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేశామని తెలిపారు. గైర్హాజరైన వారికోసం వచ్చేనెల రెండు నుంచి నాలుగో తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని వివరించారు. ఇందుకోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అవసరమైన ధ్రువపత్రాల వివరాలను ఈనెల నాలుగున వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు. అభ్యర్థులు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలనీ, అవసరమైన అన్ని ధ్రువపత్రాలనూ పరిశీలనకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈనెల 13 నుంచి వచ్చేనెల నాలుగో తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురావాలని కోరారు. వారికి ఆ తర్వాత అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఈ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు ఎవరైనా గైర్హాజరైతే వారు తర్వాత నిర్వహించే ప్రక్రియలో ఉండబోరని తెలిపారు. ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 581 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 23న టీటీపీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు 1,45,359 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.