శిల్పకథ – చరమదశ

క్రీ.శ. 10వ శతాబ్దం నుండి క్రీ.శ. 13వ శతాబ్దం వచ్చే నాటికి భారత దేశమంతా కళలు అభివృద్ధి చెందటమే కాక తారాస్థాయినందుకున్నాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, మధ్య భారతాలలోని రాజులు అందించిన ప్రోత్సాహంతో ప్రాంతీయ కళలు, శిల్పం, నిర్మాణం రక్తి కట్టాయి.
మధ్య ప్రదేశ్‌లోని ఖజురహో మందిర నిర్మాణాలు చండేల రాజులు క్రీ.శ. 10 శతాబ్దంలో నిర్మించినవి. అవి వాటి ప్రత్యేకత చాటుతూ, కామసూత్రం ఆధారంగా నిర్మించినవా అనిపిస్తాయి.
ఒరిస్సాలోని హీరాపూర్‌ ప్రాంతంలో క్రీ.శ. 10 వ శతాబ్దంలో నిర్మించిన యోగినీ దేవతల మందిరంపై కప్పు శిఖరం లేకుండా ఒక ప్రత్యేకతతో వుంటాయి. భువనేశ్వర్‌లోని క్రీ.శ. 10వ శతాబ్దపు, రాజారాణి మందిరం, క్రీ.శ. 11 – 12 శతాబ్దాల లింగరాజ మందిరమూ ఒక వంతైతే, క్రీ.శ. 13వ శతాబ్దంలో గంగా రాజు ఒకటవ నరసింహవర్మ నిర్మించిన కోణార్క మందిరం ఒక రథం ఆకారంలో వున్న సూర్య మందిరం పెద్ద చక్రాలపై నిర్మించారా అనిపిస్తుంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు వుంటుంది లింగరాజు మందిరం.
చోళ : దక్షిణ భారతాన్ని పల్లవుల తరువాత పాలించిన ముఖ్యులు చోళరాజులు. వీరు తంజావూరు రాజధానిగా క్రీ.శ. 9వ శతాబ్దం నుండి క్రీ.శ. 13వ శతాబ్దం వరకూ విశాల రాజ్యాన్ని పాలించారు. ఒకటవ ఆదిత్య చోళుడు తన ఒక్కో విజయానికి ఒక్కో గుర్తుగా శివమందిరాలు వరుసగా, కావేరి నది ఒడ్డున రెండు వైపులా నిర్మించాడు. తంజావూరు బృహదీశ్వర మందిరంలోని లింగోద్భవ శివ, మహిషాసుర మర్ధని దుర్గ శిల్పాలు వారి కళలకు ఉదాహరణలా అందంగా, నిపుణతతో చెక్కిన శిల్పాలు.
క్రీ.శ. 12వ వతాబ్దంలో తంజావూరులో నిర్మించిన రాజరాజేశ్వర మందిరం ఆనాటి శిల్పం, నిర్మాణ పద్ధతులకు తార్కాణమైంది. అప్పటి వరకూ అంత పెద్ద మందిరం ఎక్కడా కట్టబడలేదు. ఒకటవ రాజరాజ చోళుడి కాలానికి కళల ఉచ్ఛస్థితి, అతని రాజకీయ, ఆర్థిక పరిస్థితులు స్థిరంగా వుండి ఆ గొప్ప మందిర నిర్మాణం జరిగింది. ఇక్కడి ద్వార పాలకుల ఎత్తు మనిషికంటే రెండున్నర ప్రమాణాల ఎత్తుగా ఒక కాలు, ఒక చేయి ఎత్తి గదపై వుంచి ద్వారం వైపు తిరిగి నిలుచున్న భంగిమలో వుంటారు. ఈ లెక్కన మనం ఆ మందిర బృహద్‌ నిర్మాణం ఊహించవచ్చు. ఈ మందిరాన్ని అందుకే బృహదీశ్వర మందిరం అని కూడా అంటారు. 80 టన్నుల బరువున్న ఒకేరాతితో చెక్కిన శిఖరంతో 14 అంతస్థులు, 60 మీటర్ల ఎత్తు వుంటుంది ఈ మందిర విమానం. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రాక మానదు. అత పెద్ద శిఖరాన్ని అంత ఎత్తుకి ఎలా చేర్చారని? ఇసుకతో 6 కి.మీ. పొడవున వాలుగా ఒక వంతెనలా కట్టి ఆ శిఖరాన్ని పైకి లాగుతూ ఎత్తి పెట్టారట. మరి ఆనాడు మెషిన్లు లేవు కదా! అక్కడి పెద్ద నంది కూడా 6 మీటర్ల ఎత్తు వుండి ఒకే రాతితో చెక్కబడింది. గర్భ గృహానికి ఎదురుగా నంది మండపంలో నిలుచుని ఉంటాడు ఈ నంది. రాజరాజ చోళుడి కొడుకు ఒకటవ రాజేంద్ర చోళుడు కూడా గంగెకొండ చోళపురంలో మరో బృహదీశ్వర మందిరం నిర్మించాడు. అందులో చండీశానుగ్రహమూర్తి చెప్పుకోదగ్గది. చండ అనే పిల్లవాడు భక్తితో ఇసుక లింగం చేసి రోజూ ఆవు పాలతో అభిషేకం చేసేవాడట. విషయం తెలియక అతని తండ్రి ఇసుక లింగాన్ని కాలితో తన్నితే తండ్రికే దండన విధించాడు. అది చూసి శివుడు ఆ పిల్ల వాడి భక్తికి మెచ్చి ఆశీర్వదించాడు.
ఈ కథ ప్రమాణంగా ఒకటవ రాజేంద్ర చోళుడు ఆ చండీశానుగ్రహమూర్తి శిల్పం మందిరంలో నిర్మింపజేశాడు. అతని కిరీటధారణకు గుర్తుగా తనకు శివుడే శిరోధారణం చుడుతున్నట్టు పోల్చి ఆ శిల్పం చెక్కించాడు. చోళుల కాలంలోని లోహంతో పోత పోసిన శిల్పాలు చెప్పుకోదగ్గవి. తంజావూరులో ఈ నాటికీ లోహ శిల్పాలు పోత పోసే కర్మాగారాలున్నాయి. ఇవి పంచలోహాలతో పోత పోసిన శిల్పాలు. వీటిలో కొన్ని శిల్పాలు ఆ చోళ శిల్పాలకే పేరు ప్రతిష్టలు, గుర్తింపు తెచ్చాయి. ఆనంద తాండవం చేస్తున్న శివుని నటరాజ శిల్పం. జటలు విప్పి నృత్యం చేస్తున్నప్పుడు అవన్నీ అతని శిరస్సు చుట్టూ అగ్ని రేకుల్లా ఆవరించి వుంటాయి. మరో శిల్పం కృష్ణుడి కాళీయ మర్ధన శిల్పం. బాలుడు ఒంటి కాలిమీద కాళీయుడి పడగపై నిల్చుని, అతని తోకని చేత బట్టి నాట్యం చేసిన శిల్పం.
కాకతీయ సామ్రాజ్యం : చాళుక్యులు, చోళులపై గెలిచి కాకతీయులు తమ రాజ్య స్థాపన చేశారు. వీరు క్రీ.శ. 11వ శతాబ్దపు మధ్య నుండీ క్రీ.శ. 1325 వరకూ పాలించారు. ముందు వీరి రాజధాని హనుమకొండ అయినా, తరువాత (వరంగల్‌) ఓరుగల్లుకి మార్చారు. వారి రాజ్యాన్ని దక్షిణాన కంచీపురం వరకు పెంపొందించారు. వీరి కాలంలో ఎన్నో కళాకృతుల నిర్మాణాలు జరిగాయి. శాతవాహనులు, ఇక్ష్వాకుల కళలు 1,2 శతాబ్దాల నుండీ పల్లవులు చోళులను తాకి, కాకతీయుల వరకూ ఆ పద్ధతులు పాకి కనిపిస్తాయి. కాకతీయుల మందిరాలన్నీ ఒక ఆవరణలో ఒక శిఖర మందిరం లేదా త్రికూట, మూడు మందిరాల కూడలిలా నిర్మించారు. క్రీ.శ. 1162 లో ఒకటవ రుద్రుడు కట్టించిన వేయి స్తంభాల మందిరం హనుమకొండలో వుంది. ఇది రుద్రేశ్వర, వాసుదేవర, సూర్యదేవర అనే త్రికూట మందిరం. ఈ మందిరంపైన శిఖరం ముస్లింల దాడులలో ధ్వంసం చేయబడగా, ఈ మందిరం పైన సమతల పై భాగం మటుకే కనిపిస్తుంది. ఎదురుగా వున్న రంగ మండపమూ ధ్వంసం చేయబడి ఇప్పుడు ఆనవాలుగా మటుకే మిగిలింది. ఈ రెంటి నడుమ నంది అందంగా ఆసీనమై కూర్చుని వున్న శిల్పం వుంటుంది. ఈ మందిర కప్పు లోపల పలకల డిజైనులు పేర్చి, మందిరం అంతా చక్కటి నునుపు మెరుపుతో చెక్కబడి వుంటుంది.
హనుమకొండకు 60 కి.మీ. దూరంలో పాలంపేటలో వున్న రామప్ప మందిరం క్రీ.శ. 1198 – 1261 మధ్య పాలించిన గణపతి రుద్రుడు కట్టించినది. ఇది రుద్రేశ్వర మందిరం. ఇది ఒకే మండప మందిరం. ఈ మందిరంపై కప్పుకి ఆనుకుని కిందవైపు వున్న ఆలస కన్యల శిల్పాలు, నిలువెత్తు శిల్పాలు, చక్కటి మెరుపుతో చెక్కిన నల్లరాతి శిల్పాలు. ఒక కన్య చేతిలో అద్దం పట్టి అలంకరించుకుంటుండగా, ఒక నర్తకి తన నాట్యంలో మునిగి వుంటుంది. ఒక తల్లి తన ప్రేమ పంచుతుంటే, మరో కన్య చిలుకలతో ఆడుకుంటుంది. ఇలా ఎన్నో వివరాలు ఆనాటి శిల్ప ప్రకాశ అనే శిల్ప శాస్త్రం లో రాయబడింది. ఆ శిల్ప శాస్త్రం ప్రకారం, ఆ ఆలస కన్యలు నిర్మాణానికి జీవం పోస్తాయి. మందిరం గోడలపై అందంగా చెక్కిన ఆకులు, పూవులు, తీగలు, అందంగా తీర్చి చెక్కిన పై కప్పుతో పాటు మందిరం లోపలి గణేశుడు, దుర్గ మూర్తులు కూడా నునుపు మెరుపుతో చెక్కినవేను.
హోయశాలులు : చాళుక్యుల రాజ్యం విచ్ఛిన్నమై దేవగిరి ప్రాంతం యాదవులు, తూర్పు ప్రాంతం ఓరుగల్లు కాకతీయులు, దక్షిణ కన్నడ హోయశాలులు చేజిక్కించుకున్నారు. ఈనాటి హలిబీడు ప్రాంతం, ఆనాడు దొరసముద్రంగా పిలువబడి వారి రాజధాని అయింది. వీరు క్రీ.శ. 1006 నుండే ప్రాముఖ్యతలో వున్నా క్రీ.శ. 1190లో రెండవ బల్లాల రాజు తన రాజ్యం ప్రకటించాడు. ఆపై క్రీ.శ. 1346 వరకు పాలించారు. వీరి కాలంలో మొదటి దశ కంటే రెండవ దశలో కళలు అతి అందమైనవి. వీరి కళల్లో దక్కని, ఉత్తర, దక్షిణ భారతీయ కళల మిశ్రమం కనిపిస్తుంది. వీరి ప్రతీ కట్టడమూ ఒకదాన్ని మించినది మరోటి. ఒక్కో అంగుళం అతి శ్రద్ధగా ఎంతో నైపుణ్యంతో చెక్కబడి, చూడటానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. హోయశాలుల పద్ధతి అతి నైపుణ్య పద్ధతని ప్రసిద్ధి చెందింది. అమర శిల్పి జక్కన్న ఈ రాజ నిర్మాణాల శిల్పే. క్రీ.శ. 12వ శతాబ్దపు విష్ణువర్ధనుడి కాలం నాటికి, రాజులే కాదు, రాజ పరివారం వారు, మంత్రులూ కళలకు ప్రోత్సాహం ఇచ్చారు. హలిబీడులోని హోయశాలేశ్వరుడి మందిరం, శిల్పులు తమ ఆత్మని శిల్పంలో కలబోసి చెక్కారనిపిస్తుంది. అక్కడి రెండు శివాలయాల ఎదురుగా రెండు పెద్ద నంది విగ్రహాలు జీవకళ వుట్టిపడుతూ వుంటాయి. పెద్ద నంది మెడడోలు మడతలు పడి, శాంతంగా కూర్చుని శివుడి వంక చూస్తున్నట్టున్న నడి వయసు నంది. కొంచెం చిన్న వయసున్నట్టుందనిపించే రెండవ నంది చక్కటి ఆభరణాల అలంకారంతో ఎంతో చురుకుగా, ఇప్పుడే లేచి పరుగుతీయడానికి సిద్ధంగా వుంది అన్నంత చురుకుగా కనిపిస్తుంది. వాటి వయసును, మనసునూ శిల్పంలో అలా ఎలా పట్టారబ్బా అనిపిస్తుంది.
బేలూరు చెన్నకేశవుడి మందిరమూ లోపల, బయట అందమైన శిల్పాలు ఒక పద్ధతిలో చెక్కబడ్డాయి. ఆ మందిర నిర్మాణంలో ఒక రాజసముంది.
విజయనగరం : క్రీ.శ. 13వ శతాబ్దం తరువాత ముస్లిం రాజుల ఆధిక్యానికి ఎన్నో రాజ్యాలు లొంగి పోయాయి. ఆపై రాజ్యం చేసిన రాజులు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడవవలసి వచ్చింది. విజయనగర రాజులు ముస్లింల ఆక్రమణలకు ఎదురు నిల్చుని రాజ్యం చేశారు. వీరి రాజ్యకాలం క్రీ.శ. 1336 – 1565 మధ్య. హరిహర బుక్క రాయలు హంపిలో రాజ్యం నెలకొల్పారు. వీరి కాలంలో హిందూ ముస్లిం స్పర్ధలే కాదు, రాజ్యం లోపల వైష్ణవ, జైన స్పర్ధలు కూడా వుండేవి. క్రీ.శ. 1509 – 1530 మద్య కృష్ణదేవరాయల కాలంలో సాహిత్యం, కళలు రక్తి కట్టాయి. హంపిలోని విఠలనాథ, హజారరామ మందిరాలు, ఉగ్ర నరసింహ శిల్పం గొప్పవి. అలాగే లేపాక్షి నంది ఎంతో ఎత్తైనది. అక్కడి వీరభద్ర మందిరంలోని చిత్రాలు, నాట్య మండపంపై చెక్కడాలు అందమైనవి. వీరు పెద్ద విగ్రహాలు, ఎత్తైన మందిరాలు చేయించారు. కానీ కళల విషయంలో మందిర గోడలపై చెక్కిన శిల్పాలలో ముందరి శతాబ్దాల జీవకళ తగ్గింది. క్రీ.శ. 1565 తాలి కోట యుద్ధంలో ముస్లిం రాజులు అందరూ కలిసి ఈ రాజ్యాన్ని ఓడించారు.
నాయక రాజులు : విజయనగర రాజుల సామంతులు, తరువాత వీరు మధురై రాజధానిగా పాలించారు. క్రీ.శ. 1623 – 59లో పాలించిన తిరుమల నాయక ఎన్నో కట్టడాలు కట్టించాడు. మీనాక్షి సుందరేశుల మందిరంలో ఎన్నో గోపురాలు కట్టి, మీనాక్షి గుడి ముస్లింల దాడుల నుండి రక్షణ కోసం ఎదురుగా కనిపించకుండా పక్కగా కట్టించాడు. ఈ మందిరంలో 33 మిలియన్ల శిల్పాలున్నాయట. ఈ హాలు వేయి స్తంభాల మండపం. శ్రీరంగంలో 21 గోపురాలు వున్నాయి. రామేశ్వరంలోని మండపం అందమైనది. వీరి కాలంలో చిదంబరంలోలాగా ఎన్నో మోహినీ, ఆనంద శివ తాండవ మూర్తులు కళలలో తీర్చి కనిపిస్తాయి. శ్రీరంగంలో చెక్కిన మిధున శిల్పంలో యూరోపియన్ల శైలి కనిపిస్తుంది. ఆనాటికి యూరోపియన్లు భారతదేశం చేరారు.
– డా||యమ్‌.బాలామణి, 8106713356