శవాల మధ్య వెతుకులాట!

Search among the corpses!తన తల్లి కోసం, మేనత్త కోసం ముందు ఘటనా స్థలానికి, ఆ తర్వాత అధికార్లు ఆర్డరేసిన అలీఘడ్‌కీ, అక్కడా లేకుంటే ఈటాకి ఉరుకులు పెట్టాడు చందన్‌ జాతవ్‌! ఏ శవాల గుట్టల్లోనూ తమవారు లేరు. ఎవరికి కంప్లెయింట్‌ ఇవ్వాలో తెలీదు. వారి జాడ చెప్పేవారు లేరు. దీనంగా ఆకాశం వైపు చూస్తూ కుమిలి పోయేవారు కొందరు. తన తల్లీ, భార్య, కూతురు విగత జీవులుగా కన్పడి, గుండె పగిలి వారి చితికి నిప్పంటించే లోపు, పదే పదే స్పృహ తప్పిపడే వ్యక్తి కన్నీటిని తుడవగలరా ఈ లోకంలో ఎవరైనా? అది శత్రు దేశాలు బాంబువేసిన ప్రదేశం కాదు. అక్కడ భూకంపమొచ్చి భవనాలు కూలిపోలేదు. వీళ్ళంతా నిరుపేదలు. అంటే సామాజికంగా వెనుకబడ్డవారు కూడా. బతుకులు దుర్భరమై భక్తి మార్గంలో ఓదార్పు దొరకవచ్చనే నమ్మకంతో గడ్డిపోచల్ని కూడా మానులుగా భ్రమపడే అల్ప జీవులు.
ఫులురామ్‌ గ్రామంలో ప్రవచనాలు (సత్సంగ్‌) వినడానికి వచ్చారు. అది పది, పదిహేను వేల మంది పట్టే స్థలమట (దాన్నే తర్వాత 80 వేల మంది స్థలమని మీడియా చిలక పలికింది) బాబా నారాయణ్‌ హరి అలియాస్‌ సాకార్‌ విశ్వ హరి బాబా అలియాస్‌ భోలే బాబా 1990 వరకు పోలీస్‌ కానిస్టేబుల్‌. 1991 నుండి ఆ అవతారం చాలించి ఈ భోలే బాబాలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అప్పర్‌ ప్రైమరీ విజ్ఞానంతోనే ప్రవచాలు ప్రారంభించాడు. తొక్కిసలాట తర్వాత ఆ భక్తుల భర్తలు, తండ్రులు, కొడుకులు సదరు ఆశ్రమంపై చెప్పులు, రాళ్ళూ ఎందుకు విసిరారు? అంత చిన్న గ్రామంలోకి రెండున్నర లక్షల మంది ప్రవాహంలా వచ్చి పడ్తూంటే జిల్లా యంత్రాంగం గుడ్లప్పగించి చూసిందా? దీనికి బాధ్యతెవరిది? ఈ ‘భోలే బాబా’ ఆదిత్యనాథ్‌ బాబా రాజ్యంలోనే ఎందుకవతరించాడు? ఎఫ్‌ఐఆర్‌లో విశ్వహరి అలియాస్‌ నారాయణ్‌ హరి పేరు ఎందుకు చేర్చలేదు? రంగంలోకి దిగిన ఆదిత్యనాథ్‌ ఇందులో సంఘ వ్యతిరేక శక్తుల కుట్ర కోణం కూడా ఉండవచ్చన్న ప్రకటన వెనుక మాస్టర్‌ ప్లాన్‌ ఏమైనా ఉందా?
జిల్లా మెజిస్ట్రేట్‌ గారి నివేదికలో నేలంతా బురదగా జారుతూ ఉన్నపుడు భోలే బాబా గారి వ్యక్తిగత సిబ్బంది (బౌన్సర్లు) ప్రజల్ని వెనక్కి నెట్టేయడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. సదరు బాబా నడిచిన చోట మట్టిని తాకడానికి జనం ఒకరిపై ఒకరు విరగబడ్డారట! ఆ బాబా నడిచిన చోట మట్టిని నోట్లో వేసుకుంటేనో, నుదిటికి రాసుకుంటేనే మంచి జీవితం వస్తుందన్న మూఢనమ్మకం ప్రజల ప్రాణాలను వందల సంఖ్యలో బలిగొంది. ఈ మాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌ గతంలో లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్ళొచ్చాడు. కరోనా సమయంలో యాబై మందితో ‘సత్సంగ్‌’ నిర్వహిస్తానని పర్మిషన్‌ తీసుకుని యాబైవేల మందిని పోగేశాడన్న ఘనత కూడా ఈయనదే. యూపీలో కరోనా విస్తృతికి ఈయన కూడా తన ‘వంతు’ కృషి చేశాడన్నమాట.
ఈ ఘటన జరగంగానే బాబా, ఆయన శిష్యబృందం అక్కడ్నించి మాయమయ్యారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరే లేదు కాబట్టి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ఆయన కోసం వేటాడట్లేదు. ‘సంఘవ్యతిరేక శక్తులు’ జొరబడ్డారట! ఆశ్చర్యమేమంటే మహిళల జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ (బీజేపీ) జాతీయ కౌన్సిల్‌ సభ్యురాలే) భోలే బాబానే దీనంతటికి కారణం. ముందు అతన్ని అరెస్ట్‌ చేయాలని చెప్పింది. ఆదిత్యనాథ్‌ ఆలోచనలో ఏముందో? ఒక జర్నలిస్టు తీసిన లెక్క ప్రకారం ఇటువంటి ఘటనలు ఇప్పటికి సుమారు డజను జరిగాయి దేశంలో. ప్రజల చైతన్యం పెరగకపోతే లేదా అభ్యుదయ శక్తులు పెంచలేకపోతే ఇవి పునరావృతం అయ్యే ప్రమాదముంది. ప్రజల విలువైన ప్రాణాలు గాల్లో కలిసి పోతాయి.
దీన్ని ఆపే బాధ్యత ప్రభుత్వాలదే. శాస్త్రీయ ఆలోచనను ప్రజల్లో పెంపొందించడం పాలకుల బాధ్యతే. హత్రాస్‌ ఘటనకు కారణమైన భోలే బాబాని అరెస్ట్‌ చేయాలి. ఇన్ని లక్షల మంది పాల్గొనే సందర్భాల్లో తగిన బందోబస్తుతో పాటు అంబులెన్సులు, వైద్య బృందాలు అందుబాటులో ఉండేలా చూడాలి. భోలే బాబా భక్తులు మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లలోనూ ఉన్నారట! బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేదని ఆనందించే అల్ప సంతోషులు మతోన్మాద పెరుగుదలకు ఈ మూఢ విశ్వాసాలు దోహదం చేస్తాయని గుర్తించడం అవసరం. ఫ్యూడల్‌ సంబంధాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో పేదరికం, నిరక్షరాస్యత కూడా విస్తారంగా ఉన్నాయి. ఇవి హేతుబద్ధమైన ఆలోచనలకు ప్రధాన అవరోధం. ఈ సాంప్రదాయశక్తులను కూకటివేళ్ళతో పెకిలించడమే ప్రజాతంత్రవాదుల కీలక కర్తవ్యం. ఈ మృత్యుఘోషకు కారకులను శిక్షించడం అవసరం.