వాటికి మించి సీజన్‌ 4

వాటికి మించి సీజన్‌ 4బాలకృష్ణ మోస్ట్‌ ఎవైటెడ్‌ అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4ను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ శనివారం అనౌన్స్‌ చేసింది. వ్యాఖ్యాతగా బాలకృష్ణను ప్రజెంట్‌ చేసే అద్భుతమైన ఫస్ట్‌లుక్‌, 3డీ యానిమేటెడ్‌ ప్రోమోని లాంచ్‌ చేసింది. అల్లు అరవింద్‌ (ఆహా డైరెక్టర్‌), అనిల్‌ రావిపూడి (డైరెక్టర్‌), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌), అజిత్‌ ఠాకూర్‌ (ఆహా డైరెక్టర్‌), రవికాంత్‌ సబ్నవిస్‌ (ఆహా సిఇఓ), రాజీవ్‌ చిలక (గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌) సహా పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. బాలకష్ణ మాట్లాడుతూ, ‘అన్‌స్టాపబుల్‌ మొదలవ్వడమే ఒక విస్పోటనం. నాన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే ఈ ప్రోగ్రామ్‌ చేశాను. ఈ షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌ కోసమే అంగీకరించా. మా టీమ్‌ కష్టానికి ఫలితమే అన్‌స్టాపబుల్‌ సక్సెస్‌. ఐఎండీబీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో ఉంది. మన దేశంలోనే రీజినల్‌ లాంగ్వేజ్‌లో నెంబర్‌ వన్‌ షోగా నిలిచింది. ఎంతో మంది హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మొదటి మూడు సీజన్స్‌కి వచ్చి, వాళ్ళ మనసుల్లో మాటని ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు. ఈ షో విజయంలో వారి పాత్ర కూడా ఉంది. నా చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా ఈ షోలో భాగం కావడం ఆనందంగా ఉంది. ‘అన్‌స్టాపబుల్‌’ మూడు సీజన్లు సక్సెస్‌ అయ్యాయి. అందుకే సీజన్‌-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్‌ రూపంలో ట్రైలర్‌ తీసుకొచ్చారు. సీజన్‌ 4 చాలా అద్భుతంగా వస్తుంది’ అని అన్నారు.