సెబీ చీఫ్‌ లాలూచీ బహిర్గతం

Sebi chief Laluchi exposedఅమెరికాకు చెందిన పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన తాజా నివేదిక సెబీ ప్రధాన అధికారి మాధబి పురి బుచ్‌ పాత్ర గురించి తీవ్రమైన ప్రశ్నలు ముందుకు తెచ్చింది. అదానీ గ్రూపు వివిధ నిబంధనల ఉల్లంఘనలకు, షేర్ల రేట్ల విషయంలో మాయాజాలానికి పాల్పడిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఆ నియంత్రణ సంస్థకి ఆమె బాధ్యత వహిస్తున్నారు.
హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రకారం సెబీ చైర్‌పర్సన్‌ బుచ్‌ 2015లో ‘గ్లోబల్‌ డైనమిక్‌ ఆపర్చునిటీ ఫండ్‌’ అన్న దాంట్లో పెట్టుబడులు పెట్టారు. సరిగ్గా ఆమె సెబీ పూర్తి కాలపు సభ్యురాలిగా బాధ్యత స్వీకరించడానికి ముందే 2017లో ఆమె వాటిని తన భర్త ఖాతాకు బదలాయించారు. ఆ నిధులను నిర్వహించేది ఆమె భర్త అయినా 2018లో బుచ్‌ స్వయంగా ఇచ్చిన మెయిల్‌తో వాటి నుంచి బయటపడ్డారు. పెట్టుబడులు మళ్లీ ప్రారంభమయ్యాయి.
విదేశాల్లోని ఈ సంస్థలో బుచ్‌ పెట్టుబడులు పెట్టినట్టు ఒక సమాచార వేగు ఇచ్చిన ప్రకటన ఆధారంగా హిండెన్‌బర్గ్‌ నిర్థారించింది. గౌతమ్‌ అదానీ సోదరుడైన వినోద్‌ అదానీ నిర్వహిస్తున్న ‘బెర్ముడా మారిషస్‌ ఫండ్‌’లో అది భాగంగా ఉంది. అప్పటికే గౌతమ్‌ అదానీపై సెబీ దర్యాప్తు సాగుతున్నా పెట్టుబడులు పెట్టారు.
తొలి నివేదిక సంచలనం-సుప్రీం కోర్టు
హిండెన్‌బర్గ్‌ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదిక సంచలనం కలిగించిన సంగతి గుర్తు చేసుకోవాలి. అదానీ గ్రూప్‌ చాలా బాహాటంగా దశాబ్దాల తరబడి స్టాక్‌ మార్కెట్‌ మాయాజాలానికి పాల్పడిందని, లెక్కలు తారుమారు చేసిందని ఆ నివేదిక ఆరోపించింది. ఫోరెన్సిక్‌ విశ్లేషణ తర్వాత అదానీ గ్రూప్‌ అనేక విదేశీ సంస్థల పేరుతో తన స్వంత నిధులనే అటూ ఇటూ తిప్పి తమ కంపెనీలలో పెట్టుబడి పెట్టిందీ కళ్లకు కట్టినట్లు వివరాలు నమోదు చేసింది. అదానీ గ్రూపు చట్ట ఉల్లంఘనల పట్ల తగు విధంగా వ్వహరించడంలో సెబీ వైఫల్యం ఉందేమో దర్యాప్తు చేయడానికి 2023 మార్చిలో సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో నిపుణుల బందాన్ని నియమించింది. అంతేకాక ప్రభుత్వ రంగ సంస్థల తరపున వున్న వాటాలకు సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా ఉల్లంఘనలు జరిగాయేమో నిర్దిష్టంగా విచారించాలని ఆదేశించింది. అదానీ కంపెనీలకు సంబంధిత పక్షాలు నడిపిన లావాదేవీల సమాచారం వెల్లడించడంలో వైఫల్యాలు, షేర్ల రేట్లలో కుంభకోణాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలని ఆదేశించింది.
ఈ ఉల్లంఘనల పైన, అదానీ కంపెనీకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పైన జరిపిన సెబీ దర్యాప్తులో ఏ తప్పూ కనుగొనలేకపోయిందని 2023 మే లో కోర్టుకు నిపుణుల కమిటీ తెలియజేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే అదానీ గ్రూపునకు సంబంధించిన వివిధ ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ అంతకన్నా ముందే దర్యాప్తు జరుపుతున్నది. ఈ విషయంలో ఎలాంటి తీవ్ర ఉల్లంఘనలు ఉన్నట్లు నిరూపించడంలో విఫలం కావడం బట్టి చూస్తే సెబీ వైఫల్యం అనుమానాస్పదమని, ప్రశ్నార్ధకమని హిండెన్‌బర్గ్‌ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. బుచ్‌ స్వయానా వినోద్‌ అదానీకి సంబంధించిన విదేశీ సంస్థలో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం అవుతుంది.
ఎప్పుడూ చెప్పలేదే?
హిండెన్‌బర్గ్‌ నివేదిక లోని ఆరోపణలను అసంబద్ధమైనవని వ్యక్తిగత శీలహననమేనని చైర్‌పర్సన్‌ బుచ్‌, అలాగే సెబీ ఖండించాయి. ఈ ఫండును నెలకొల్పిన అనిల్‌ అహుజా తన భర్తకు బాల్యమిత్రుడు కావడం వల్లనే పెట్టుబడులు పెట్టామని బుచ్‌ ఒక ప్రకటనలో చెబుతున్నారు. ఆ పెట్టుబడులు పెట్టిన విషయం తమకు సరైన సమయంలోనే తెలియచేశారని, అలాగే అవసరమైనప్పుడు ఆమె ఆ వ్యవహారాలకు దూరంగా ఉన్నారని సెబి అంటున్నది. అయితే ఆమె అదానీకి సంబంధించిన దర్యాప్తులలో దూరంగా ఉన్నారని చెప్పగల నిర్దిష్టమైన సమాధానం లేదు. బుచ్‌ విదేశీ నిధులకు సంబంధించి తన భాగస్వామ్యాన్ని సుప్రీంకోర్టుకు గాని ఆరుగురు నిపుణుల బందానికి కానీ 2023 మార్చిలో కోర్టు నియమించిన బందానికి గాని ఆమె తెలియజేసినట్లు సమాచారం లేదు. అదానీ గ్రూపుపై వచ్చిన 22 ఆరోపణలలో 20 విషయాలను దర్యాప్తు ముగించినట్లు మాత్రమే సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. మిగిలిన వాటి దర్యాప్తును మరో రెండు మూడు నెలల్లో ముగించనున్నట్టు తెలియజేసింది. మరో సమస్యపై కూడా దర్యాప్తు ముగించినట్టు ఇక ఒకటి మాత్రమే మిగిలినట్టు సెబీ 2024 జనవరిలో కోర్టుకు తెలియజేసింది. అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరికినట్టు చెప్పనేలేదు. చైర్‌పర్సన్‌గా బుచ్‌ ఆ కంపెనీలపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే రెండుసార్లు అదానీతో సమావేశమైన విషయాన్ని కూడా వెల్లడించలేదు. దీన్నిబట్టి చూస్తే ఆమెపై వచ్చిన తీవ్ర ఆరోపణలకు ప్రాధాన్యత లభిస్తున్నది. సెబీ చీఫ్‌ వ్యక్తిగత అంత:కరణ, అలాగే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థ అధిపతి నుంచి ఆశించే ఉన్నత స్థాయి ప్రమాణాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ రెండు కోణాలరీత్యా మాధబి బుచ్‌ తన స్థానం నుంచి తక్షణం తప్పుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సమర్థన-వాస్తవాల నిర్ధారణ
బీజేపీ, మోడీ ప్రభుత్వం సెబీ చీఫ్‌పై వచ్చిన ఈ ఆరోపణలను వెనక్కు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశ స్టాక్‌ మార్కెట్‌ను ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడానికి కాంగ్రెస్‌ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు విదేశీ సంస్థలతో కుమ్మక్కు అవుతున్నాయని ఆరోపిస్తున్నాయి.
సెబీ చీఫ్‌కు వత్తాసుగా ఇలాంటి దారుణమైన వినాశకరమైన సమర్థనకు దిగడం చిన్నశ్రేణి మదుపరులలో గానీ, ప్రజలలోకానీ విశ్వాసం పాదుకొల్పడం సాధ్యం కాదు. ఒక నయా ఉదారవాద వ్యవస్థలో నియంత్రణ సంస్థలను బడా కంపెనీలు ఏ విధంగా గుప్పిట పెట్టుకోగలవో బుచ్‌ ఉదంతం బహిర్గతం చేస్తోంది.
కనుక ఈ సరికొత్త సాక్ష్యాల నేపథ్యంలో సుప్రీంకోర్టు అదానీ గ్రూపు సాగించిన దారుణమైన నియమోల్లంఘనలనూ స్టాక్‌ మార్కెట్‌ మాయాజాలాలనూ కూడా కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించడం మరింత శ్రేయస్కరం అవుతుంది. లేదంటే ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు జరపటం ఏకైక మార్గంగా వుంటుంది.
– ఆగస్టు 14 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం