మోడీకి సెగ

Sec to Modi– ప్రధాని కాశ్మీర్‌ తొలి పర్యటనలో గళమెత్తిన జనం
– లఢక్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ భారీ నిరసన
– నిరాహార దీక్ష ప్రారంభించిన మెగసెసే అవార్డు గ్రహీత వాంగ్‌చుక్‌
లఢక్‌ : జమ్మూకాశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. అయితే లఢక్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లఢక్‌ ప్రాంతంలోని లెహూలో దుకాణాలు, వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేశారు. ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. మరోవైపు ఈ నెల 4న కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలు విఫలమవడంతో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని పర్యావరణ కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్‌ వాంగ్‌చుక్‌ ప్రకటించారు.
‘నేను సోనమ్‌ వాంగ్‌చుక్‌ని. హిమాలయాల నుండి ప్రపంచ ప్రజలకు ఓ సందేశాన్ని అందజేస్తున్నాను. ఈ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. ఇది దశల వారీగా జరుగుతుంది. ఒక్కో దశలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తాను. అవసరమైతే పొడిగిస్తాను. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రోద్యమంలో 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన చేసిన సుదీర్ఘ దీక్ష అదే. ఆయన నడిచిన శాంతియుత మార్గంలో నేనూ నడవాలని అనుకుంటున్నాను. నాకు నేనే బాధ పడతాను. ఎవరినీ బాధ పెట్టను’ అని బుధవారం లెహూలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ వాంగ్‌చుక్‌ చెప్పారు. ఈ దీక్షలో మరి కొంతమంది భాగస్వాములవుతారని కాంగ్రెస్‌ నేత నామ్‌గియాల్‌ తెలిపారు. లఢక్‌లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యులును అమలు చేసి, రాష్ట్ర హోదా కల్పించాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం తిరస్కరించిందని ఆయన చెప్పారు. లఢక్‌లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన ప్రారంభించాలని వారు నిర్ణయించారని అన్నారు. తమ డిమాండ్‌ను రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని దృష్టికి తెచ్చేందుకు ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు. మరోవైపు లెహూఅపెక్స్‌ బాడీ (ల్యాబ్‌), కార్గిల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ)తో చర్చలు కొనసాగుతున్నాయని కేంద్రం తెలిపింది. అయితే చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని ల్యాబ్‌ కో-చైర్మెన్‌ లక్రుక్‌ చెప్పారు.