ఎస్‌ఈసీసీ వెబ్‌సైట్‌ డౌన్‌

31న ఇండియా ఫోరం మెగా ర్యాలీ– రెండు నెలలకు పైగా పని చేయని వైనం
– సాంకేతిక కారణాలతోనే ఈ సమస్య
– కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన సామాజిక ఆర్థిక, కుల గణన (ఎస్‌ఈసీసీ) వెబ్‌సైట్‌ రెండు నెలలకు పైగా పని చేయటం లేదు. అయితే, సాంకేతిక కారణాలతోనే ఎస్‌ఈసీసీ వెబ్‌సైట్‌ డౌన్‌ అయిందని ఈ వెబ్‌సైట్‌ను నిర్వహించే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెబ్‌సైట్‌ను తిరిగి యాక్టివ్‌గా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలనూ చేసినట్టు తెలిపింది. 1931 తర్వాత 2011లో భారత్‌ ఎస్‌ఈసీసీని నిర్వహించింది. ఇది పేపర్‌లేకుండా నిర్వహించిన తొలి కుల గణన ఇది. దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా ఈ గణన జరిగింది. గ్రామాల్లో ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి భూమి కలిగి లేదనీ, జీవనోపాధికి మ్యాన్యువల్‌ లేబర్‌ పైనే ఆధారపడుతున్నాయని తేలింది. అలాగే, గ్రామీణ భారత్‌లోని పేద విద్య స్థితి గురించి కూడా ఇందులో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ వంటి వివిధ సామాజిక సంక్షేమ పథకాలను మెరుగుపర్చటమే ఈ గణన లక్ష్యం. అయితే, ఇలాంటి కీలక సమాచారం పబ్లిక్‌ డొమైన్‌లో ఇప్పుడు అందుబాటులో లేకపోవటం గమనార్హం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే విషయంలో మోడీ సర్కారుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనీ, ఇందుకు ఎస్‌ఈసీసీ వెబ్‌సైట్‌ పని చేయకపోవటమే ఒక ఉదాహరణ అంటూ సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో కులగణన అంశం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం విదితమే. కుల గణనను నిర్వహించిన బీహార్‌ రాష్ట్రం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇప్పుడు ఇదే దారిలో ఏపీ చేరింది. తాము కూడా కులగణను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 19న ఈ సర్వే ఇప్పటికే మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణను నిర్వహిస్తామని కాంగ్రెస్‌ వంటి రాజకీయ పార్టీలు సైతం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. కాగా, భారత్‌లో పదేండ్లకోసారి నిర్వహించే జనగణన 2021లో కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 150 ఏండ్ల దేశ చరిత్రలో ఇలా జనగణన ఆలస్యం కావటం ఇదే తొలిసారవటం గమనార్హం.