నవతెలంగాణ-ఆసిఫాబాద్
నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలను ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా 2వ ఏఎన్‌ఎం యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు టి దివాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో రెండవ ఏఎన్‌ఎంలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో రెడ్ జోన్లలోకి వెళ్లి పని చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని అయినప్పటికీ ప్రభుత్వాలు వీళ్ళ సేవలను గుర్తించడం లేదని విమర్శించారు. గత సంవత్సర కాలం క్రితం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్‌తో సమ్మె చేయడం జరిగిందని అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్‌కు ఓటు వేయండని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరిని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. నేటికీ 9 నెలలు గడుస్తున్న ఇచ్చిన హామీ మరిచిపోయిందన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఇవ్వాలని డిమాండ్ చేశారు. 100 శాతం గ్రాస్ సాలరీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ విధానంలో పనిచేసినపూర్తి కాలానికి వారికి గ్రాట్యుటీ చెల్లించాలని, ఐదు వేల పైన పాపులేషన్ ఉన్నవారికి అదనంగా కేటాయించాలని కోరారు. పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగా సెలవులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, రెండవ ఏఎన్‌ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, కోశాధికారి సునీత నాయకురాలు వసంత, గోదావరి, శైలజ, లక్ష్మి, లలిత, భాగ్, స్వరూప, జ్యోతి పాల్గొన్నారు.