– కాన్పూర్ టెస్టును వీడని వర్షం
– ఆట పూర్తిగా రద్దు
– భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు
నవతెలంగాణ-కాన్పూర్
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు వీడటం లేదు. తొలి రోజు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు.. రెండో రోజు పూర్తిగా ఆటను సాగన్వివలేదు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో కాన్పూర్ టెస్టు రెండో రోజు ఆట వర్షార్పణంగా ముగిసింది. రెండో రోజు 90 ఓవర్ల ఆట రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. తొలి రోజు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. బంగ్లాదేశ్‌ను 35 ఓవర్లలో 107/3 పరుగులకు కట్టడి చేసింది. యువ పేసర్ ఆకాశ్ దీప్ (2/34) రెండు వికెట్ల మాయజాలంతో మెప్పించాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లు మోమినుల్ హాక్ (40 నాటౌట్), ముష్ఫీకర్ రహీమ్ (6 నాటౌట్) అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే.
అలా వచ్చి.. ఇలా వెళ్లి! :
వెలుతురు లేమి, వర్షంతో తొలి రోజు 35 ఓవర్ల మాత్రమే సాధ్యపడగా.. రెండో రోజు కనీసం ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టలేదు. రాత్రి కురిసిన వర్షంతో అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిచిపోయింది. దీంతో ఉదయం నుంచి పిచ్, అవుట్ ఫీల్డ్ మొత్తం కవర్లలో కప్పి ఉంచారు.
ఉదయం గ్రీన్‌పార్క్ గ్రౌండ్‌కు చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెటర్లు ఎంతోసేపు డ్రెస్సింగ్‌రూమ్‌లో ఉండలేదు. ఉదయం 10.20 గంటలకు స్టేడియం నుంచి ఆటగాళ్లు హోటల్ గదులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అంపైర్లు రెండో రోజు ఆటను అధికారికంగా రద్దు చేశారు.
వీడని వర్షం ముప్పు : కాన్పూర్ టెస్టును వర్షం ముప్పు వీడటం లేదు. తొలి మూడు రోజుల వర్షం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఉదయం సెషన్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురువనుంది. మధ్యాహ్నం నుంచి వరుణుడు కాస్త శాంతించ నున్నాడు. వర్షం తగ్గినా.. వరుసగా మూడు రోజుల వర్షంతో అవుట్ ఫీల్డ్ బాగా తిన్నది. స్వల్ప సమయంలో పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేయటం క్యూరేటర్, గ్రౌండ్స్‌మెన్‌కు అంత సులభం కాబోదు.