రైతు సమస్యలపై రెండో దశ ఉద్యమం

Raithu sadassu– మతోన్మాద శక్తులను తరిమికొట్టాలి : కార్మిక, కర్షక సదస్సులో వక్తలు
అమరావతి : దేశంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రెండో దశ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు కార్మిక, కర్షకులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని దోచిపెట్టే ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. మతోన్మాద శక్తులను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకు కార్మికులు, కర్షకులు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలను పెద్దఎత్తులో చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి, ఆంధ్రప్రదేశ్‌ ట్రేడ్‌ యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్షక, కార్మిక రాష్ట్ర సదస్సు విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షత వహించారు. ఎఐకెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ రైతాంగం నిర్వహించిన సుదీర్ఘ పోరటం ఫలితంగా పండించిన పంటకు మద్దతు ధర కల్పన, రైతు రుణమాఫీ, విద్యుత్‌ చట్ట సవరణ చట్టం ఉపసంహరించుకుంటామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఏడాది గడిచినా ఇప్పటి వరకు వీటిలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహించారు. జాతీయ డిమాండ్లతో పాటు రాష్ట్ర సమస్యలను జోడించి దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాష్ట్రాల రాజధానుల్లో నవంబర్‌ 26,27,28 తేదిల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమం ఈ ప్రభుత్వాలకు హెచ్చరికగా ఉండేలా ఐక్య రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాలని తెలిపారు. క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9న ‘క్విట్‌ కార్పొరేట్‌-క్విట్‌ ఫాసిస్ట్‌-క్విట్‌ కమ్యూనల్‌’ నినాదంతో ఆందోళనలు చేపట్టాలని కోరారు. కార్పొరేట్‌, మతోన్మాద, ఫాస్టిస్ట్‌ శక్తులు వెనక్కి పోవాలంటూ ప్రతి జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని బిజెపి ధ్వంసం చేసిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 15న అన్ని ప్రాంతాల్లో నిరసనలు చేపట్టాలని అన్నారు. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ప్రతి గ్రామంలో, ప్రతి రైతు వద్దకు ఉద్యమ స్ఫూర్తిని తీసుకెళ్లాలని కోరారు. ఎఐకెఎస్‌(అజరు భవన్‌) జాతీయ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కోరారు. దేశం కోసం పోరాడేందుకు సైన్యంలో ఎక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి మత చిచ్చు రేపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రోజుకొక మాట చెబుతున్నారని, శారీరకంగా, మానసికంగా ఆయన ఆరోగ్యంగా లేరని పేర్కొన్నారు. కార్మిక, కర్షక శక్తులు ఏకమై మోడీ సర్కార్‌ను, బిజెపిని దేశం నుంచి తరమాల్సిన అవసరం ఉందన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ మాట్లాడుతూ బిజెపి డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ను ఓడించేందుకు త్రిబుల్‌ ఇంజన్‌ (రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు) ఒకే వేదికపైకి వచ్చారని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను బిజెపి చిన్నాభిన్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థకు గత బడ్జెట్‌లో రూ.90వేల కోట్లు కోత పెట్టిందని తెలిపారు.వ్యవసాయ కూలీలకు కనీస వేతనం అందించాలంటే రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పారు. కులాలు, మతాలు పేరుతో గొడవలు సృష్టించి బిజెపి ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎపిలో కూడా క్రైస్తవులపై దాడి చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.