పేదరిక నిర్మూలనలో దేశంలోనే రెండో స్థానం

– నిటి అయోగ్‌ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ)లో ప్రగతి లెక్కలు
– ఇదంతా కేసీఆర్‌ పాలనతోనే సాధ్యం : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచినట్టు నిటి అయోగ్‌ ప్రకటించడం పట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలోనూ రాష్ట్రం ముందువరసలో ఉందని తెలిపారు. పదేండ్ల కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు వల్లనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2020-21తో పోలిస్తే 2023-24 నాటికి (ఎస్‌డీజీ) లో 74 స్కోర్‌తో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఐదు పాయింట్లు మెరుగైందని తెలిపారు. చాలా రంగాల్లో తెలంగాణ సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం పదేండ్ల అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. తక్కువ ధరలో క్లీన్‌ ఎనర్జీని అందించటంలో తెలంగాణ వంద మార్కులు సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో 90 మార్కులు, అభివృద్ధిలో 84 మార్కులు సాధించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ విజన్‌, సాహౌసేపేత నిర్ణయాలతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ప్రతీకారాలు, రాజకీయ కక్షలు, పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టడం ఆపి రాష్ట్రాభివృద్ధిపై రేవంత్‌రెడ్డి సర్కారు ఫోకస్‌ పెడితే ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.