ఎన్నికల బాండ్లతో రహస్య వ్యాపారాలు!

Secret deals with election bonds!–  సంపన్నుల ప్రయోజనాలకు వినియోగం : సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : అధికారంలో వున్నవా రితో రహస్యంగా వ్యాపారం చేసేందుకు సంపన్నులు ఎలక్టోరల్‌ బాండ్లను ఉపయోగించుకునే అవ కాశం వుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పాలక రాజకీయ పార్టీలకు అనుకూలంగా లేదా అజ్ఞాతంగా క్విడ్‌ ప్రో కో లోకి ప్రవేశించేందుకు గానూ రెగ్యులర్‌ బ్యాంకింగ్‌ మార్గం ద్వారా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుందని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. ధ్రువీకరించిన ఖాతాలు కలిగిన వ్యక్తులను ప్రభావవంతమైన సంస్థలు రహస్యంగా ఏర్పాటుచేసుకునే అవకాశాలు వున్నాయని తెలిపింది.
”ఉదాహరణకు ‘ఎ’ అనే వ్యక్తి రూ.100 కోట్లు విలువ చేసే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశారు. ‘బి’ కోసం ఏర్పాటు చేయబడిన వ్యక్తే ‘ఎ’. ఎందుకంటే ‘ఎ’ కి నిర్ధారించబడిన కెవైసి అకౌంట్‌ వుంది. రాజకీయ పార్టీకి విరాళమిచ్చేది ‘బి’. కోటి రూపాయలు చొప్పున వంద కోట్ల బాండ్లను కొనుగోలు చేసేందుకు ‘బి’కి వందమంది వ్యక్తులు వుండవచ్చు కూడా.” అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి ఆయన నేతత్వం వహిస్తున్నారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ మొదటి రోజు జరిగిన విచారణలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రసంగిస్తూ, ‘ఇటువంటి విషయాల్లో భారతీయుడి మనసు చాలా తెలివిగా వుండగలదు, అనేక రకాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మేం నియంత్రిస్తాం.’ అని అన్నారు. కెవైసి ఖాతాదారుల ద్వారా బాండ్లు కొనుగోలు చేయడంతో అసలు విరాళమిచ్చే వ్యక్తి వివరాలు అజ్ఞాతంగా వుంచబడుతున్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. ఆచరణాత్మక రాజకీయాల్లో ఆ విరాళమిచ్చే వ్యక్తి అనేక మార్గాల్లో తన విరాళం గురించి రాజకీయ పార్టీకి తెలియజేయవచ్చన్నారు. ఇక్కడ విరాళమిచ్చే వారు ఎవరో తెలియకుండా వుంటున్నది ప్రజలకే కానీ రాజకీయ పార్టీకి కాదని చంద్రచూడ్‌ అన్నారు.
ప్రతిపక్షాల దాతలకు ఉపయోగం
పాలక పార్టీ నుంచి వచ్చే పర్యవసానాలకు భయపడకుండా ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వాలనుకునేవారికి ఈ అజ్ఞాతమనేది ఉపయోగపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ‘మీరు దాత పేరు వెల్లడించినట్లైతే, మీరు ఒక రాజకీయ పార్టీకి విరాళమిచ్చారని ఇతర రాజకీయ పార్టీలు కూడా తెలుసుకుంటాయని భావించాల్సి వుంటుంది. ఒకవేళ అధికారంలో లేని పార్టీకి మీరు విరాళమిచ్చారనుకుందాం, ఆ దాతకు ఆ రాష్ట్రంలో వ్యాపారం వుందనుకుందాం, ఆ దాత పేరు అందరికీ తెలిసిపోతుంది. అక్కడ లాజిక్‌ వుంది. ఈ లాజిక్‌ చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది మనం నిర్ణయించుకోవాల్సి వుంది.” అని అన్నారు.
విరాళాల్లో 90శాతం పాలక పార్టీలకే
పిటిషనర్ల తరపున వాదనలు ప్రారంభించిన న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ, రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళాల గురించి తెలుసుకోవడమనేది ప్రాధమిక హక్కని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లు చట్టబద్ధమైన ముడుపులని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. విరాళాల్లో 90శాతానికి పైగా పాలక పార్టీలకే వస్తున్నాయన్నారు. ఇప్పటికే జరిగిన లేదా జరగాల్సిన పనుల కోసం ఉద్దేశించబడినవని ఆయన వాదించారు.