బీజేపీ నేతల రహస్య భేటీ

Secret meeting of BJP leaders– పలువురు మాజీ ఎంపీల హాజరు!
– ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి ఫిర్యాదు
– కిషన్‌రెడ్డి వద్దు… బండికి పగ్గాలివ్వండి
– బూత్‌ కన్వీనర్ల నుంచి అధిష్టానానికి ఊహించని షాక్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ సీనియర్‌ నేతలు హైదరాబాద్‌ శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో రహస్యంగా భేటీ అయ్యారు. ఇలా ఆ పార్టీ అసంతృప్త నేతలు వరుసగా భేటీ కావడం మూడోసారి. ఆ సమావేశానికి హాజరైన వారిలో సీనియర్‌ నేతలతో పాటు పలువురు మాజీ ఎంపీలు కూడా ఉన్నట్టు తెలిసింది. వారంతా బీజేపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర శాఖలో కీలక పదవిలో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయానికి ఆ సీనియర్‌ నేతలు వచ్చారు. ఆయా పార్టీల్లో ఓ వెలుగు వెలిగిన తాము ఏదో ఆశించి బీజేపీలో చేరితే కనీస గౌరవం కూడా దక్కట్లేదని వాపోయినట్టు తెలిసింది. తాడోపేడో తేల్చుకునేందుకు వారంతా ఢిల్లీ వెళ్లాలని కూడా నిర్ణయం చేసినట్టు సమాచారం. జాతీయ నాయకత్వం నుంచి కూడా భరోసా లభించని పక్షంలో వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కూడా వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వద్దు…జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ని తిరిగి నియమించడంటూ బీజేపీలో ధిక్కార స్వరం మొదలైంది. ఈ నెల 25న దీన్‌ దయాళ్‌ ఉపాధ్యారు జయంతి ఉంది. దానిని పురస్కరించుకుని బూత్‌ల వారీగా నివాళులు అర్పించడంతో పాటు ప్రతి కార్యకర్తా రెండు మొక్కలు నాటాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగా బూత్‌ కమిటీ బాధ్యులకు రాష్ట్ర కార్యాలయం నుంచి అధిష్టానం ఫోన్లు చేయిస్తున్నది. ఆ సందర్భంగా పార్టీ గ్రాఫ్‌ పడిపోతుండటంపై బూత్‌ బాధ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ షాకింగ్‌ సమాధానాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ‘వెంటనే అధ్యక్ష పదవి నుంచి కిషన్‌రెడ్డిని తొలగించి బండి సంజయ్ ని నియమించండి. పార్టీ అంతా ఆగమాగమవుతున్నది. ఈ విషయాన్ని దయచేసి హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లండి’ అంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓ గ్రూపు తయారై ఇదంతా చేయిస్తందనే ప్రచారమూ ఆ పార్టీలో ఉంది.