– బ్రిటీష్ మీడియా
ఇంగ్లాండ్ : బ్రిటీష్ ప్రభుత్వ అధికారులు రష్యా ప్రభుత్వ ప్రతినిధులతో ఉక్రెయిన్ యుద్ధ కాలమంతా అంతర్జాతీయ భద్రతపైన తీసుకునే చర్యలపైన రహస్య చర్చలు జరిపారని గత వారాంతంలో బ్రిటీష్ వార్తా సంస్థ ”ద ఐ” పేర్కొంది. గత 18 నెలల కాలంలో ఈ చర్చలు వియన్నా, న్యూయార్క్ వంటి నగరాలలో జరిగాయని, ఆహార ధాన్యాల కొరత, అణు భద్రతవంటి విషయాలపైన చర్చలు జరిగాయని సదరు వార్తా సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. అయితే ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధానికి దౌత్య పరిష్కారాన్ని కనుగొనటం గురించి చర్చజరగలేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక బ్రిటీష్ అధికారి ఉటంకిస్తూ ఆ వార్తాపత్రిక తెలిపింది. జులై నెలలో రష్యా బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ ఒప్పందం నుంచి వైదొలగిన తరువాత ఆహారధాన్యాల ధరలు బాగా పెరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ తన ధాన్యాన్ని ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్చ దేశాలకు ఎగుమతి చేసేది. అయితే ఒప్పందంలో భాగంగా రష్యాను తన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోనివ్వాలి. కానీ ఐరోపా దేశాలు రష్యా తన ఆహారధాన్యాలను, ఎరువులను ఎగుమతి చేసుకోవటాన్ని దుస్సాధ్యం చేస్తున్నాయని రష్యా ఆరోపించి ఒప్పందం నుంచి వైదొలిగింది. అణు భద్రత ముఖ్యంగా జపొరోజ్యే అణుశక్తి ప్లాంటు భద్రతకు సంబంధించిన హామీ ఇవ్వాలని బ్రిటీష్ అధికారులు రష్యను అభ్యర్థించారని ఆ రిపోర్ట్ పేర్కొంది.బ్రిటన్ కు ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధంపైన ”వ్యూహాత్మక స్పష్టత” ఉందని, అమెరికా, నాటో కూటమితో బ్రిటన్ మమేకమై ఉందని ఒక బ్రిటీష్ దౌత్యవేత్త ఆ వార్తాపత్రికకు చెప్పారు. ఈ చర్చలు ఉక్రెయిన్ లో కాల్పుల విరమణను ఉద్దేశించినవి కావని, బ్రిటన్ ఉక్రెయిన్ తీసుకోవలసిన నిర్ణయాలను తీసుకోజాలదని బ్రిటీష్ దౌత్యవేత్తలు చెప్పారు.