సచివాలయం నిర్మాణ ఖర్చెంత…?

Secretariat construction cost...?– వివాదాస్పదమవుతున్న వ్యయం
– ఐటీ, ఆర్‌అండ్‌బీ మధ్య చర్చోపచర్చలు
– అవినీతి,అక్రమాలు జరిగాయంటున్న రాజకీయ పక్షాలు
– రూ.50 కోట్ల పనులు పెండింగ్‌
తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం నిర్మాణం వివాదాస్పదమవుతున్నది. ఆ భవనానికి అయిన ఖర్చు విషయంలో మళ్లీ చర్చోపచర్చలు చోటుచేసుకుంటున్నాయి. అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ భారీ నిర్మాణానికి అయిన ఖర్చెంత అంటే ఇతమిద్దంగా ఇంత అని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అధికారవర్గాల్లో కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక భవనానికి చేసిన వ్యయం విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గతంలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడివి మరింత బలపడుతున్నాయి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కొత్త సెక్రెటేరియట్‌ టెండర్లతో సంబంధం లేకుండా కొన్ని పనులు చేశారనే విమర్శలు తాజాగా వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం, అరోపణలు, విమర్శలు చేసుకోవడం సహజమే. అయితే ఈ సచివాలయం నిర్మాణం లో జరిగిన కొన్ని పనులకు అసలు టెండర్లే పిలవక పోవడం పాత సర్కారు లోని ఉన్నతాధికారులపై అనుమా నాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రధానంగా ఐటీకి సంబంధమైన పనుల విష యంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని అమలుచేశారనే అరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాల యం సెక్యూరిటీతోపాటు అంతర్గతంగా అవసరమైన ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ సంబంధమైన నెట్‌వర్కింగ్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, ఇతరాలకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. నిజానికి ఇది రూ. 50 కోట్ల లోపే ఉంటుందని సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో హవా నడిపిన ఆ అఖిల భారత సర్వీస్‌ అధికారి ఈవిషయంలో చొరవ చూపి పరికరాలను కోనుగోలు చేశారని బహిరంగంగానే కొందర రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఆ భవనానికి తొలుత వ్యయం రూ.550 కోట్లుగా డీపీఆర్‌లో పేర్కొన్నారు. అందులో జీఎస్‌టీ మొత్తం కూడా ఉన్నట్టు అప్పట్లో ఆర్‌అండ్‌బీ అధికారులు సెలవిచ్చారు. ఆ తర్వాత రూ. 611 కోట్లకు అంచనాలు పెంచారు. శంకుస్థాపన చేసిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు భవనానికి సంబంధించి పలు అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు పోయారు. సచవాలయ భవనం ప్లాన్‌ అనేక మార్పులు, చేర్పులకు గురైంది. అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు సలహాలు, సూచనలు వర్కింగ్‌ ఏజెన్సీ పాటించాల్సి వచ్చింది. చెన్నరుకు చెందిన పొన్ను, ఆస్కార్‌ అర్కిటెక్స్‌ కంపెనీ సచివాలయాన్ని డిజైన్‌ చేసింది.షాపూర్జీ-పల్లోంజీ సంస్థ నిర్మించింది. తొలుత 2022 , అక్టోబర్‌ దసరా పండుగ రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అయితే నిర్మాణం ఆలస్యం కావడంతో గత ఏడాది ఏప్రిల్‌ 30 ప్రారంభించారు. మే 30 నుంచి సచివాలయం అధికారికంగా విధుల్లోకి వచ్చింది.
డీపీఆర్‌లో చేర్చని ప్రార్ధన మందిరాలు
సచివాలయం చుట్టుతా నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చీ ఖర్చు కూడా తొలుత డీపీఆర్‌లో చేర్చలేదని ఆర్‌అండ్‌బీ చెబుతున్నది. కొత్తగా రోడ్లు సైతం చివరలో వేయాల్సి వచ్చిందనీ, దీంతో సచివాలయం భవన నిర్మాణం ఖర్చు తడిసిమోపెడైందని సమాచారం. ఐటీ ఖర్చును ఆర్‌అండ్‌బీ బడ్జెట్‌లోనే చూపించాలని ఆ శాఖ కోరినా సంబంధిత అధికారులు తిరస్కరించారని తెలిసింది. ఈనేపథ్యంలో మొత్తం ఖర్చు రూ.1440 కోట్ల దాకా అయినట్టేనని అధికారులు అంటున్నారు. ఇదిలావుండగా సచివాలయంలో ఇప్పటికీ చేయాల్సి పనులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. దాదాపు రూ. 50 కోట్ల మేర పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
తడిసి మోపెడు..
చివరకు మొత్తం భవన నిర్మాణం పూర్తయ్యేనాటికి ఖర్చు రూ.1140 కోట్లకు చేరినట్టు రోడ్లు, భవనాల శాఖ అధికారులు అంటున్నారు. ఇందులో రూ.100 కోట్లు ఫర్నీచర్‌కే ఖర్చు చేయడం గమనార్హం. అలాగే జీఎస్టీ మొత్తం రూ. 100 నుంచి రూ. 150 కోట్లు ఉందని చెబుతున్నారు. కీలకమైన నెట్‌వర్కింగ్‌ ఖర్చు మాత్రం రూ.300 కోట్లు అయినట్టు తెలిసింది. ఈ నిధులు ఎలాంటి టెండర్లు లేకుండా ఖర్చుపెట్టారు. సచివాలయం ప్రారంభానికి అప్పటి ప్రభుత్వం తొందరపడిందనీ, పనులు పూర్తికాకముందే చేసిందనే వ్యాఖ్యానాలు అప్పట్లోనే వచ్చాయి. టెండర్లు పిలిచే సమయం లేకపోవడంతో కంపెనీల నుంచి నేరుగా కంప్యూటర్లు, ఇతర పరికరాలు కొనాల్సి వచ్చిందని ఐటీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అవీనితి జరిగిందని రాజకీయపార్టీలు ఆరోపిస్తున్నాయి.