– దాన్ని రద్దు చేసేదాకా డ్రైవర్ల పోరాటం
– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహితలోని 106 (1)(2) సెక్షన్లను రద్దు దాకా చేసే వరకు డ్రైవర్ల పోరాటం కొనసాగుతుందని ఏఐఆర్‌టీడబ్ల్యూఎప ˜్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ చెప్పారు. రద్దు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగ్గి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జనవరి 10 నుంచి 14 వరకు జరుగుతున్న ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల సమ్మెలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ-హైదరాబాద్ హైవేపై రంగారెడ్డి జిల్లా బాటసింగారం చౌరస్తా వద్ద డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. అజరు బాబు దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. హిట్ అండ్ రన్ కేసుల్లో యాక్సిడెంట్ అయిన తర్వాత డ్రైవర్ స్పాట్ ఉండి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చి బాధితునికి వైద్యం చేయిస్తే 2 నుంచి ఐదేండ్ల వరకు జైలు శిక్ష, ఒకవేళ డ్రైవరు పారిపోతే పదేండ్ల జైలుశిక్ష, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా విధించడం దుర్మార్గమన్నారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా డ్రైవర్లనే నేరస్తులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రోడ్లు, ట్రాఫిక్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లనే మన దేశంలో 90 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ చట్టం అమలైతే డ్రైవర్లు తమ ప్రమేయం లేకున్నా పదేండ్లు జైలుపాలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగితే తప్పులతో సంబంధం లేకుండా బాధితుల తరఫు వారు, ప్రజలు ఆవేశానికి లోనై డ్రైవర్‌ని తప్పు పట్టడం, కొట్టడం, హింసించడం చేస్తున్న తీరును వివరించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో 106(1)(2) సెక్షన్లను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా డ్రైవర్లు ఐక్యంగా పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాస్తారోకోలో రంగారెడ్డి జిల్లా ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి రుద్రకుమార్, గ్రేటర్ హైదరాబాద్ సెంటర్ సిటీ నాయకులు ఖలీం, ముఖేష్, సాబీర్, మజీద్ గౌస్, వహీద్, అబ్బాస్, అలీఖాన్, విష్ణు, ఇర్ఫాన్, ఇమ్రాన్, అర్బాజ్ ఖాన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు, నర్సింహ్మా, ప్రభాకర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.