లౌకికతత్వం-భారతీయ జీవన విధానం

Secularism-Indian way of lifeరాజ్యాంగబద్ధ తమిళనాడు రాష్ట్ర ప్రథమపౌరుడు, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కన్యాకుమారిలో హిందూ ధర్మ విద్యాపీఠ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘భారతదేశంలో లౌకిక విధానానికి స్థానం లేదు. ఇది యూరోపియన్‌ భావన’ అంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత తీవ్రమైన విషయం. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసి, అధికారం చేపట్టిన ఈ గవర్నర్‌ ఒక్కక్షణం కూడా ఆ పదవిలో కొనసాగటం తగదు.
‘భారత దేశ ప్రజలమైన మేము, ఈ దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, గణతంత్ర రాజ్యాంగా నిర్మించుకో వడానికి, భారత ప్రజలందరికీ సాంఘీక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించి వారిలో భావ ప్రకటన, విశ్వాసం, ధర్మంతో ప్రజలకు ఆర్ధిక, రాజకీయ, సమానత్వాన్ని సాధించి, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ, సోదరభావం పెంపొందిం చుకోవడానికి మనం రాజ్యాంగంలో రాసుకొని, ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం’ అని రాజ్యాంగ పీఠిక స్పష్టంగా చెబుతుంది. బహుళత్వం గల భారతదేశంలో లౌకిక తత్వం దేశం అత్యంత ప్రత్యేక లక్షణం. కొన్ని వందల సంవత్సరాలుగా భిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు కలిసి మెలసి జీవిస్తున్నాయి. లౌకిక తత్వం ప్రత్యేకంగా భారతజీవన విధానంగా మారిపోయింది. భారతదేశం విభిన్న మతాల, సంస్కృతుల సంగమం అని, ఒక రంగుల హరివిల్లు అన్న భావనను నేడు కొన్ని మతతత్వ శక్తులు పనిగట్టుకొని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాయి. చరిత్రను తిరగరాస్తున్నాయి. అభూత కల్పనలు, పుక్కటి పురాణాలను చరిత్రగా నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి. గవర్నర్‌ వ్యాఖ్యలు అలాంటి వక్రీకరణలకు తార్కణంగా నిలుస్తున్నాయి.
లౌకిక వాదం అంటే? రాజ్యం నుండి మతాన్ని వేరుచేయడం. మతమనేది వ్యక్తిగతమైన సొంత వ్యవ హారంగా ఉండాలి. రాజ్యం అన్నిమతాల నుంచి వేరుపడాలి. అన్ని మతాల పట్ల తటస్తంగా ఉండాలి. రాజ్యం అన్ని మతాలకు సమానమైన గౌరవం ఇవ్వాలి. దీని ఆధారంగానే మనం రాజ్యాంగంలో మతం, కులం, వర్గం ప్రాతిపదికగా దేశపౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపించరాదని రాసుకున్నాం. లౌకికవాదం అనేది ఇండియాలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే లక్షణం. ఇది ఈ దేశ మూలాల్లోనే ఉంది. అశోకుడు, అక్బర్‌ చక్ర వర్తులు హిందూ మతస్తులు కారు. అయినా వారు అన్ని మతాలను సోదరభావంతో చూశారు. లౌకిక భారతానికి గట్టి పునాదులు వేశారు. పందొమ్మిదో శతాబ్దం ఆఖరులో లౌకికవాదం ఆవిర్భవించి బలపడింది. 1857 ప్రథమ భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం ప్రజలు కులమతాలకతీతంగా బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది గమనించిన ఆంగ్లేయులు దేశ ప్రజలను మత ప్రాతిపదికన విడగొట్టకపోతే దేశాన్ని ఎక్కువ కాలం పాలించలేమని గ్రహించారు. ఆ తర్వాత భారతీయులను మతం ప్రతిపదికగా విభజన రాజకీయాలు మొదలు పెట్టారు. అప్పటి నుండి విభజించు, పాలించు వారి జీవన విధానమైంది. వారు మతతత్వాన్ని బాగా ప్రోత్సహించారు.
ఇందుకు 1906 లో ముస్లింలీగ్‌, హిందూ మహాసభ అనే రెండు మత సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థల పని మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలు ఏకవమవ్వకుండా ఉద్యమాలను నిర్వీర్యపరిచి బ్రిటీష్‌ వారికి మేలు చేయడమే. 1947లో దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్‌ లోని ముఖ్యులు పాకిస్తాన్‌కు వెళ్లిపో యారు. ఈ హిందూ మహాసభే 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌గా ఏర్పడింది. దీని రాజకీయ రూపమే బీజేపీ. ఈ సంస్థ దేశాన్ని మతతత్వంతో నింపి వేయడానికి వందేళ్లుగా పని చేస్తోంది. తద్వారా దేశ విదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ప్రజలకు దక్కాల్సిన సమస్థ వనరులను దోచిపెడుతోంది.
ప్రజాస్వామ్య లౌకికవాద భారత రాజ్యాంగం సాక్షిగా అయోధ్యలో 1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు నేలమట్టం చేయ బడింది. తదుపరి గుజరాత్‌ మారణకాండ 2002, యూపీలోని ముజఫర్‌నగర్‌లో ముస్లిం సమా జంపై దాడులు, గోసరంక్షణ పేరుతో జరుగుతున్న ఘోరాలు, బుల్డోజర్‌ రాజ్‌ తదితర పరిణామాలన్ని భారతీయ లౌకిక చరిత్ర వారసత్వంపై దాడులే. భారత చరిత్ర చెక్కిలిపై నెత్తుటిగాయాలే. ఇలా శవాల గుట్టలపై నడుస్తూ, మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకొని పార్లమెంటులో రెండు సీట్ల నుండి 2014లో అధికారంలోకి వచ్చింది బీజేపీ. దురదృష్ట వశాత్తు సుప్రీంకోర్టు తీర్పులన్నింటీలోనూ అత్యంత ఘోరమైనదిగా అనదగిన 2019 నాటి అయోధ్య మీద ఇచ్చిన తీర్పు ద్వారా హిందుత్వ రాజకీయాలకు ఆమోదముద్ర వేసింది. ఈ తీర్పిచ్చిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోరును ఆరు నెలలు తిరగకముందే బీజేపీ అస్సాం నుంచి రాజ్యసభకు ఎంపీగా పంపి ఈ పదవిని బహు మతిగా అందించింది. న్యాయ మూర్తులు పదవీ విరమణ అనంతరం ఎలాంటి పదవులు చేపట్ట రాదని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానమే రాజ్యాంగంలోని లౌకికతత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే ఇక ఈ దేశాన్ని రక్షించేది ఎవరు? ఇక బీజేపీ వారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం మీద దాడి మొదలు పెట్టారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటిస్తున్నారు. ఆ పని చిన్నచిన్నగా చేస్తూ ముందుకుపోతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ 1949 నవంబర్‌లో మనుస్మృతిని తప్పితే అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అంగీ కరించం అని ప్రకటించింది. మొత్తం రాజ్యాంగ, లౌకిక విలువల స్థానంలో హిందూ రాష్ట్రంను స్థాపించేందుకు పూనుకొంది.ఈ మత సంస్కృతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ ప్రజాసంస్కృతిని నిర్మిద్దాం. రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య విలువలను రక్షించుకుందాం.
షేక్‌ కరిముల్లా
9705450705