– డివిజనల్ రైల్వే మేనేజర్ భర్తేశ్‌కుమార్ జైన్
– రైల్వే సేవా పురస్కారాల ప్రదానం
నవతెలంగాణ-బేగంపేట్
ఉద్యోగులు, సిబ్బంది అంకితభావం.. సమిష్టి కృషి వల్లే దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ ఉత్తమ డివిజన్‌గా నిలిచిందని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భర్తేశ్‌కుమార్ జైన్ అన్నారు. 68వ రైల్వే వారోత్సవాల్లో భాగంగా గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్ ఆడిటోరియంలో ‘రైల్వే సేవా- పురస్కారాలు-2023’ ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ డివిజన్ ప్రయాణికులు, సరుకు రవాణాలో ముందంజలో ఉండటం, ఆదాయం పెంపులో పెరుగుదల, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం తదితర అన్ని విభాగాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని తెలిపారు. అందుకు కారకులైన సిబ్బంది, ఉద్యోగులను ప్రశంసించారు. అనంతరం విభాగాల వారీగా, వ్యక్తిగతంగా ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెడల్స్‌ను, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాలిని జైన్, ఏడీఆర్‌ఎంలు జి.సుబ్రమణ్యం, రాజీవ్ కుమార్, గోపాల్, ఎస్‌ఈపీఓ అభిలాశ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.