భద్రత.. మన అందరి బాధ్యత 

Safety.. is the responsibility of all of us– రవాణా శాఖ అధికారి శంకర్ నారాయణ
నవతెలంగాణ – సిద్ధిపేట 
 రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని సిద్దిపేట రవాణా శాఖ అధికారి శంకర్ నారాయణ  అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్రాంతి హై స్కూల్ లో విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై ఆయన అవగాహన కల్పించి మాట్లాడారు. మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు విధిగా  రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే  ప్రమాదాలను ఎక్కువ శాతం లో  అరికట్టవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నారు. విద్యార్థులు సైతం తమ బాధ్యతగా ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యునికి  రోడ్డు నిబంధనల పై సూచనలు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు  తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, అలాగే కారు నడిపేవారు  సీటు బెల్టును పెట్టుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే  చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నేహా, శ్రీకాంత్, పాఠశాల చైర్మన్ అర్పితా రెడ్డి, కరస్పాండెంట్ భగవాన్ రెడ్డి, ప్రిన్సిపాల్ కుమార్ స్వామి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.