స్వాతంత్య్ర వేడుకల దృష్ట్యా మణిపూర్‌లో భద్రత కట్టుదిట్టం

Security tight in Manipur ahead of Independence celebrationsఇంఫాల్‌ : స్వాతంత్య్ర వేడుకల దృష్ట్యా రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు మణిపూర్‌ పోలీసులు ఆదివారం తెలిపారు. ఐదు జిల్లాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఇంఫాల్‌ లోయకు చెందిన కొన్ని నిషేధిత సంస్థలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఇంఫాల్‌ – పశ్చిమ, ఇంఫాల్‌-తూర్పు, తౌబాల్‌, బిష్ణుపూర్‌ మరియు చురచంద్‌పూర్‌ జిల్లాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు వెల్లడించాయి. 12 ఆయుధాలు, ఆరు మందుగుండు సామగ్రి, ఎనిమిది పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని మణిపూర్‌ పోలీసులు తెలిపారు. ఆగస్ట్‌ 15న జరగనున్న మార్చ్‌ ఫాస్ట్‌ కోసం బిఎస్‌ఎఫ్‌, పోలీస్‌, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది మరియు విద్యార్థులు రిహార్సల్స్‌ చేపడుతున్నాయని ప్రకటించారు. చురాచంద్‌పూర్‌ జిల్లా తురుబౌంగ్‌ ప్రాంతంలోని పీస్‌ గ్రౌండ్‌లో శనివారం రిహార్సల్స్‌ జరిగాయని అన్నారు. ఆగస్ట్‌ 15న కో ఆర్డినేటింగ్‌ కమిటీ (కార్కామ్‌) సమ్మెకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో భద్రతా బలగాలను గణనీయంగా పెంచామని ఓ అధికారి తెలిపారు. కార్కామ్‌లో యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (యుఎన్‌ఎల్‌ఎఫ్‌), పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఎ) సహా మరో మూడు నిషేధిత సంస్థలు ఉన్నాయని అన్నారు.