– మాజీ మంత్రి టి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లలో వందకు వంద శాతం తెలంగాణ విద్యార్థులకు దక్కేలా చూడాలని మాజీ మంత్రి టి హరీశ్‌రావు శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. లేదంటే వైద్య విద్య చదివే అవకాశాలను తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయనీ, ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటా అంటే 280 సీట్లను తెలంగాణ విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. దీంతోపాటు నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లోని దాదాపు 150 పీజీ సీట్లను వారు కోల్పోతారని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ సమీపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడంలో సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వ తీరుతో తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు 2014 నుంచి కన్వీనర్ కోటాలో 15శాతం సీట్లకు తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సైతం పోటీపడే వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు. ఇదే విధానం కొనసాగితే, 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుందనీ, దీని వల్ల దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని హరీశ్‌రావు తెలిపారు.