వర్షాలకు గజ్వేల్‌లో ఎర్రబారుతున్న మొలకలు

– దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలు
– ఆందోళన చెందుతున్న రైతులు
నవ తెలంగాణ -గజ్వేల్‌
ఆలస్యంగా సాగైన పత్తి పంటకు అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పది రోజులుగా కురుస్తున్న వానలకు చేన్లు నీరు పట్టి మొలకలు ఎర్రబారుతున్నాయి. ఎరువులు వేసి కలుపు తీసేందుకూ తెరపినివ్వడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, ములుగు మండల వ్యవసాయ డివిజన్‌ పరిధిలో పొలాలు నీటితో నిండి పత్తి, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సీజన్‌ ఆరంభంలో వర్షాలు కురవకపోవడంతో విత్తనాలు వేయలేని ప్రతికూల పరిస్థితుల్లో.. మృగశిర కార్తెలో కాస్త జల్లులు పడటంతో విత్తనాలు వేశారు. కొన్నిచోట్ల మొలకెత్తగా.. కొన్ని చోట్ల భూమిలోనే మురిగిపోయాయి.
జిల్లాలో దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తి పంట ప్రమాదకర స్థితికి చేరిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గజ్వేల్‌, జగదేవపూర్‌, కొండపాక, చేర్యాల, మిరుదొడ్డి, సిద్దిపేట గ్రామీణం, వర్గల్‌, ములుగు, రాయపోల్‌, దుబ్బాక, దౌల్తాబాద్‌ మండలాల పరిధిలో నల్లరేగడి భూముల్లోని పత్తి పంటపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. వర్షాలు ఇలాగే కురిస్తే రూ.10 కోట్ల మేర పంట నష్టం వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు.
రైతులకు సూచనలు
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు రైతులకు గజ్వేల్‌ డివిజన్‌ వ్యవసాయ అధికారి బాబు నాయక్‌ పలు సూచనలు చేశారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటల్లో మొక్కల సాళ్ల మధ్య నీరు నిలవకుండా బయటకు పోయేలా కాలువలు తీసుకోవాలని సూచించారు. అధిక తేమ వల్ల పత్తి మొక్కలకు వేరుకుళ్లి తెగులు సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని అధిగమించడానికి మొక్క వయసును బట్టి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్‌ లేదా 19.19.19 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. పంట ఎదుగుదలను పెంచడానికి వర్షాలు తగ్గిన వెంటనే 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ ఎరువులను మొక్కకు ఐదు సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలని చెప్పారు.
రోజూ వర్షంలోనే పంట చేలు
వారం రోజులుగా కురుస్తున్న వర్షంతో పత్తి సాగుచేసిన చేనంతా నీరు చేరింది. ఇప్పుడిప్పుడే వస్తున్న మొలకలు ఎర్రబారుతున్నాయి. పెట్టుబడి చేతికి వస్తుందో రాదో తెలియడం లేదు. షావుకారు వద్ద అప్పు తెచ్చాం. సమయానికి వర్షాలు రాకపోవడంతో ఆలస్యంగా పంటలు సాగు చేశాం. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
రైతు మల్లయ్య