– ఇటు రేవంత్..అటు హరీశ్.. వాడి వేడిగా అసెంబ్లీ
– ప్రత్యర్థుల మీద దాడి కోసమే ఇదంతా : మాజీ ఆర్థిక మంత్రి
– ప్రజలకు నిజం తెలియాలనే.. : సీఎం
– ఉదయం 11 నుంచి రాత్రి 8.20 గంటల దాకా కొనసాగిన సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అదే వాడీ వేడి. అదే విమర్శల దాడి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్బాణాలు, ఒకరి మీద మరొకరు సెటైర్లు. వెరసి రాష్ట్ర అసెంబ్లీ సమాశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ‘రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు- శ్వేతపత్రం’పై బుధవారం సభలో జరిగిన చర్చ సైతం ఆద్యంతం నువ్వా.. నేనా… అన్నట్టు కొనసాగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు శ్వేతపత్రాన్ని తప్పుల తడకగా కొట్టి పారేయగా… అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ధీటుగా జవాబిచ్చారు. ఒక సందర్భంలో ‘మూడేండ్ల నుంచి రాష్ట్రంలో ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు.. వారికి విషయాలన్నీ తెలుసు…’ అంటూ హరీశ్ వ్యాఖ్యానించగా, ‘2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ మంచినీళ్లు తాగనట్టు మీరు (బీఆర్‌ఎస్) చెబుతున్నారు. శివుడి నెత్తి మీదనున్న గంగను మీరే కిందికి దింపి, నల్లాల్లో పోసి ఇంటిటికీ పంపినట్టు చెబుతున్నారు…’ అంటూ సీఎం ఎద్దేవా చేశారు. ఈ వాద ప్రతివాదాలు, వాగ్వివాదాల నడుమ శాసనసభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై… రాత్రి 8.20 గంటల వరకూ కొనసాగింది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మూడు రోజుల విరామానంతరం బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన మాజీ సభ్యులు రామన్నగారి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, కుంజా సత్యవతి మృతిపట్ల సంతాపం తెలుపుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా సభ రెండు నిమిషాలు మౌనాన్ని పాటించి, వారికి ఘన నివాళులర్పించింది. అనంతరం శాసనసభలో ఎంఐఎం పక్ష నేతగా అక్బరుద్దీన్ ఓవైసీనీ, సీపీఐ పక్ష నేతగా కూనంనేని సాంబశివురావును ఎన్నుకున్నట్టు ఆయా పార్టీలు తనకు సమాచారమిచ్చాయనే విషయాన్ని స్పీకర్ ప్రకటించారు. అందువల్ల సభలో ఆయా పార్టీలకు వారే నేతలుగా వ్యవహరిస్తారని తెలిపారు.
అనంతరం ‘రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు- శ్వేతపత్రం’పై లఘు చర్చను స్పీకర్ ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి తన్నీరు హరీశ్‌రావు చర్చను ప్రారంభిస్తూ… సభ ప్రారంభమైన తర్వాతే శ్వేతపత్రానికి సంబంధించిన నోట్‌ను తమకు అందజేశారని తెలిపారు. అందువల్ల దానిపై మాట్లాడేందుకు సన్నద్ధం కాలేకపోయామని వివరించారు. ఒక గంటపాటు సభను వాయిదా వేయటం ద్వారా నోట్‌పై ప్రిపేర్ అవటానికి అవకాశమివ్వాలని సభాపతిని కోరారు.సీపీఐ సభ్యుడు కూనంనేని మాట్లాడుతూ… నోట్‌పై లోతుగా అధ్యయనం చేయటానికి వీలుగా ఒక రోజు సమయం కేటాయించాలని కోరారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్… తేనీటి విరామం కోసం సభను అరగంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఉదయం 11.28 గంటలకు వాయిదా పడిన సభ తిరిగి మధ్యాహ్నం 12.47 గంటలకు ప్రారంభమైంది.
అనంతరం ఒకవైపు హరీశ్‌రావు, మరోవైపు సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సభ హీటెక్కింది. అంకెలు, సంఖ్యలు, గణాంకాలతో పోటాపోటీగా వీరిద్దరూ చర్చలో పాల్గొన్నారు. ‘కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు, అత్యంత అవినీతికరంగా కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు…’ అంటూ హరీశ్ విమర్శలు గుప్పిస్తే, ‘నిజాలు చెబితే పరువు పోతుందంటూ బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు..
కానీ ఊరుకుంటే ప్రజల ప్రాణాలే పోయే దుస్థితి దాపురించింది…’ అని సీఎం ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై రూ.80 వేల కోట్లను మేం ఖర్చు పెడితే, రూ.లక్ష కోట్ల అవినీతి జరిగినట్టు ప్రభుత్వం చెబుతోందంటూ మాజీ ఆర్థిక మంత్రి పేర్కొంటే… ఆ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దుర్వినియోగం చేశారు, అబద్ధాలతో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రేవంత్ ఎదురుదాడికి దిగారు. మధ్యలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు బీఆర్‌ఎస్ సభ్యులతో వాగ్వావాదానికి దిగారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఒకానొక దశలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. ఆయనతో వాదనకు దిగారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూ మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. శ్వేతపత్రాలపై లఘు చర్చలో ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. సభ గురువారం కూడా కొనసాగనుంది.
‘శివుడి నెత్తిన గంగను మీరే తెచ్చారా? – ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి
‘తెలంగాణ ప్రజలు 2014కు ముందు మంచినీళ్లే తాగలేదా? నల్లాలే లేవా? శివుడి నెత్తిన గంగను భూమిపైకి తెచ్చి మీరే రాష్ట్రంలో పారించారా?’ అని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు.