ధర చెల్లించని మిల్లులను సీజ్‌ చేయండి

Seize non-paying mills– క్వింటా ధాన్యం రూ.2800కు కొనకపోతే చర్యలు
– అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
– మిల్లు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు భరోసా
– అయినా పట్టించుకోని మిల్లర్లు
నవతెలంగాణ-వేములపల్లి
రైతులు మిల్లుకు తెచ్చిన ధాన్యం క్వింటాకు రూ.2800 చెల్లించకపోతే మిల్లులను సీజ్‌ చేయండని ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా వేముపల్లి మండలంలోని శెట్టిపాలెం సమీపంలో మహర్షి రైస్‌ మిల్లు వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అదే సమయంలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని గూడూరు, వెంకటాద్రిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి రైతుల ఆందోళనను గమనించి వాహనం ఆపి వారితో మాట్లాడారు. మిల్లులు సిండికేట్‌గా మారి ధర చెల్లించడం లేదని కొనుగోలు నిలిపివేశారని రైతులు తెలిపారు. క్వింటాకు రూ.1950 నుంచి 2000 వరకు మాత్రమే ధాన్యానికి ధర చెల్లిస్తున్నారని విన్నవించారు. దాంతో మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. వెంటనే జాయింట్‌ కలెక్టర్‌, డీఎస్‌ఓతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ధర చెల్లించని మిల్లులను వెంటనే సీజ్‌ చేయాలని ఆదేశించారు. రైతులకు రూ.2000 ధర చెల్లిస్తే నష్టపోతారని, క్వింటా ధాన్యానికి రూ.2800 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే మిల్లర్లు ఎఫ్‌సీఐకి ధాన్యాన్ని అందించకుండా అక్రమంగా నిలువ ఉంచుకున్నారని, దీంతోపాటు ధాన్యం కొనుగోలు చేయని, కనీస ధర ఇవ్వని మిల్లులపై కేసు వేయండి అని అధికారులను ఆదేశించారు.
మంత్రి హెచ్చరికలు పట్టించుకోని మిల్లర్స్‌
రైతులకు రూ.2800 ధర చెల్లించాలని, అన్ని మిల్లులు ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి హెచ్చరించినప్పటికీ మిల్లర్లు పట్టించుకోలేదు. మహర్షి మిల్లు వద్ద రైతులు, అధికారులతో మంత్రి మాట్లాడి వెళ్లిన కొద్దిసేపట్లోనే మిల్లర్లు ధాన్యానికి రూ.2150 మాత్రమే చెల్లించారు. చేసేదేమీలేక రైతులు తక్కువ ధరకే తమ ధాన్యాన్ని అమ్ముకొని వెళ్లిపోయారు. అధికారులు మిల్లుల వద్ద పర్యవేక్షణ చేసి మంచి ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.