నకిలీ విత్తన పరిశ్రమ సీజ్‌

– గుట్టు చప్పుడు కాకుండా విత్తనాల తయారీ
– 259 క్వింటాళ్ల విత్తన ధాన్యం బస్తాల నిల్వ
– జిల్లా కలెక్టర్‌ జిల్లా వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు
– ఇన్చార్జి వ్యవసాయ అధికారిని ఝాన్సీ
నవతెలంగాణ-వెల్దుర్తి
మాసాయిపేట మండల పరిధి చందాయపేట చౌరస్తా సమీపంలో గల ఓ పరిశ్రమలో ఎలాంటి అనుమతులు లేకుండా వరి విత్తనాలను ప్రోసెసింగ్‌ చేయడంతో పాటు ప్యాకింగ్‌ చేసి నిల్వ చేశారన్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గురువారం ఇంచార్జి వ్యవసాయ అధికారిని ఝాన్సీ వెళ్లి పరిశీలించారు. అందులో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన ప్రోసెసింగ్‌ యంత్రాలతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్యాకింగ్‌ చేసి నిల్వ చేసిన విత్తనాల బస్తాలు ఉన్నాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గోదామును నిర్మించి దొంగ చాటుగా ఓ యజమాని విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యదేచ్చగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నుంచి విత్తన కేంద్రం ఏర్పాటుకు తీసుకోవలసిన లైసెన్సులు తీసుకోకుండా దర్జాగా విత్తన తయారీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని విత్తనాలను తయారు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. కనీసం గోదాం నిర్మాణాన్ని కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది. దొంగ చాటుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని స్థానికులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మండల వ్యవసాయ అధికారులు ఝాన్సీ పరిశ్రమ వద్దకు చేరుకొని విత్తన యంత్ర కేంద్రంతో పాటు తయారు చేసిన విత్తనాలను పరిశీలించారు. సుమారు 259 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను నిల్వ ఉంచినట్లు ఆమె తెలిపారు. విత్తనాలు తయారుచేసిన ధాన్యం బస్తాలపై ఎలాంటి పేరు లేదని పరిశ్రమలకు అసలే అనుమతులు లేవని ఆమె తెలిపారు. పరిశ్రమను సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విత్తన యాక్ట్‌ఫై కేసు నమోదు చేస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పరిశ్రమపై జిల్లా కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.