– అక్రమార్కుల చేతుల్లో రేషన్ షాప్‌లు
– పలుమార్లు పట్టుబడ్డా మారని ధోరణి
– 6(ఏ) కేసులు పెట్టినా మారణి దందా
– అధికారుల అండదండలతో అక్రమంగా బియ్యం దందా…?
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ షాపుల పనితీరు, రేషన్ షాపుల్లో అక్రమాలు రోజురోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. జిల్లా అధికారుల అండదండలతోనే రేషన్ షాపుల్లో ఉచిత బియ్యం అక్రమంగా లారీల కొద్దీ ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ షాపుల మీద విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, బియ్యం సక్రమంగా నిలువలు లేకపోవడంతో షాపు నిర్వాహకుల మీద 6(ఏ) కేసులో నమోదు చేస్తున్నారు. తిరిగి అదే షాపు వారికే నిర్వహణకు మళ్ళీ కేటాయించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉచితంగా సరఫరా చేయాల్సిన ఉచిత బియ్యం జిల్లా అధికారులు అండదండలు ఉండబట్టే షాపు నిర్వహణదారులు ఇప్టా రాజ్యాంగ రెచ్చిపోతున్నారని విమర్శిస్తులున్నాయి. ఉచిత రేషన్ బియ్యం సరఫరా చేసే షాపు యజమానులకు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ వారు రోజు రోజుకీ లక్షాధికారులు అవుతున్నారని ఆరోపనలు ఉన్నాయి. ప్రతి నెల లారీల కొద్దీ ఉచిత బియ్యాన్ని అక్రమంగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని, దీని కారణంగానే లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుస్తుంది. రెవిన్యూ అధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా జిల్లా రెవెన్యూ అధికారుల అండదండలతోనే షాపులు తిరిగి అదే అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం గమనార్హం. ఇటీవల 15 రోజుల క్రితం రామవరంకు చెందిన ఒక రేషన్ షాప్‌లో బియ్యం నిల్వలలు సక్రమంగా లేవని, షాపు యజమానిపై వరంగల్ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. సమీపంలోని రేషన్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి నిర్వహిస్తున్న ఈ షాపులో బియ్యం నిల్వలో తేడాలు ఉన్నాయని, లైసెన్స్ యజమాని అయిన వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం, నిజానికి షాపు యజమాని ఎవరో విజిలెన్స్ అధికారులకు తెలియదు. అతనిపై కేసు నమోదు చేశారు. గతంలో ఇదే షాపుపై కేసు నమోదు చేశారు. దీని కారణంగ లైసెన్స్ డీలర్ లేకున్నప్పటికీ సమీప డీలర్‌కు ఈ షాపును ఎటాచ్ చేశారు. కేసు నమోదు, తిరిగి పది రోజుల్లోనే ఆ షాపుకు మళ్ళీ షాపు తలుపులు తెరుచుకోవడం స్థానిక ప్రజలను ఆర్చర్యానికి గురిచేసింది. వివిధ షాపులు నిర్వహిస్తు, గతంలో అనేక బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డ షాపు నిర్వాహకుడే ఈ షాపు కేటాయించడం పట్ల జిల్లా అధికారుల అవినీతి పరులకు ఏమేర కొమ్ము కాస్తున్నారో తెలుస్తుంది. పేద వాడికి ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు అక్రమంగా సరఫరా చేస్తూ లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. అక్రమాలకు అలవాటు పడిన షాపు నిర్వాహకులపై అధికారులు ఎన్ని కేసులు పెట్టినప్పటికీ వెంటనే జరిమానాలు చెల్లించి, అదే షాపులను తిరిగి దక్కించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఉచిత బియ్యంతో వారికి వస్తున్న లాభం ఎంతుందో తెలుస్తుంది. ఇటీవల మున్సిపల్ పరిధిలోని రామవరంలోని రేషన్ షాప్ నెంబర్ 20పై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల కథనం ప్రకారం డీలర్ నూనావత్ వెంకటేశ్వర్లు షాపు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు తనిఖీ చేయగా బియ్యం నిల్వల్లో 18 క్వింటాల 80 కేజీలు బియ్యం తక్కువ ఉన్నాయని నిర్ధారణ కావడంతో పౌరసరఫరాల చట్టం ప్రకారం 6 (ఏ) కింద కేసు నమోదు చేసి షాప్ సీజ్ చేశారు. సీజ్ చేసిన కొన్ని రోజులకే షాపు నిర్వాహణ మళ్లీ అక్రమార్కులకే కేటాయించడం జరిగిందని స్థానికుల మండిపడుతున్నారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పరిశీలన చేయాలని, బియ్యం సక్రమంగా పేదలకు అందేవిధంగా చూడాలని పేదలు కోరుతున్నారు. అక్రమ బియ్యం సరఫరా చేస్తున్న వారిపై పదే పదే కేసులు నమోదు అవుతున్నప్పటికీ వారికే షాపులు కేటాయించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారిని తొలగించి నిరుద్యోగ యువతకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.