ఎయిర్‌పోర్టులో రూ.67లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

– ప్రయాణికుడి అరెస్ట్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.67లక్షల విదేశీ కరెన్సీని అధికారులు శనివారం పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబారుకి విదేశీ కరెన్సీతో వెళ్తున్న ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ప్రయాణికుడు రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబారు వెళ్తున్నాడు. అతని వెంట తెచ్చుకున్న బ్యాగును డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టులో తనిఖీ చేశారు. పాలిథిన్‌ కవర్లు చుట్టి తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు. దాన్ని బయటకు తీసి లెక్కిస్తే రూ.67, 11,250 విలువైన యూఎస్‌ డాలర్లు ఉన్నాయి. వెంటనే కరెన్సీని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేసి ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.