అక్రమంగా తరలిస్తున్న గంజాయి, మత్తు పదార్థాల స్వాధీనం

– చెక్‌పోస్టు వద్ద లారీని పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు
– పరారైన లారీ డ్రైవర్‌
నవతెలంగాణ-జహీరాబాద్‌
ఒడిశా, ఆంధ్రా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా మాదకద్రవ్యాలను తరలిస్తున్న లారీని శుక్రవారం డీఆర్‌ఐ (డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ) అధికారులు పట్టుకున్నారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దు నుంచి లారీని మహారాష్ట్రలో ఎక్కడికి చేర్చుతారో పట్టుకుందామని అధికారులు వెంబడించారు. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఆర్టీఏ సరిహద్దున ఉన్న అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్దకు వచ్చిన వెంటనే అధికారులు లారీలను తనిఖీ చేస్తున్న విషయాన్ని లారీ డ్రైవర్‌ పసిగట్టాడు. వెంటనే లారీ డ్రైవర్‌ పత్రాలను తీసుకొని కిందికి దిగి అక్కడి నుంచి పరారైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు లారీని చిరాకుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఉదయం నుంచి విచారణ జరుగుతున్నా, అధికారులు వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. విచారణ పూర్తయిన అనంతరం వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.