– చివరి మూడు టెస్టులకు త్వరలో జట్టు ప్రకటన
– విశాఖలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ చర్చలు
విశాఖపట్నం : ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచులు ముగిశాయి. ఇంగ్లాండ్, భారత్ చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. సిరీస్ 1-1తో సమవుజ్జీల సమరంగా ఉంది. చివరి మూడు టెస్టులకు సీనియర్ సెలక్షన్ కమిటీ త్వరలోనే జట్టును ఎంపిక చేయనుంది. వ్యక్తిగత కారణాలతో, గాయాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైన తరుణంలో సెలక్షన్ కమిటీపై ఫోకస్ కనిపిస్తుంది. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు తిరిగి జట్టులోకి వస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
సుదీర్ఘ మంతనాలు : విశాఖ టెస్టులో విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కార్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ముగ్గురు ప్రధానంగా రానున్న మూడు టెస్టులకు జట్టు కూర్పుపై చర్చించినట్టు తెలుస్తున్నది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్నాడు. కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడ్డారు. జాతీయ క్రికెట్ అకాడమీ రాహుల్‌కు క్లియరెన్స్ ఇచ్చినా.. జడేజా ఫిట్‌నెస్‌పై ఇంకా నీలినీడలు కనిపిస్తున్నాయి. మూడో టెస్టుకు ఎనిమిది రోజుల విరామం లభించటంతో కోహ్లి రాజ్‌కోట్ టెస్టుకు అందుబాటులో ఉంటాడా? అందుబాటులో లేనని సెలక్షన్ కమిటీకి సమాచారం ఇస్తాడా ? అనేది తెలియాలి. ‘కోహ్లి విషయాన్ని సెలక్టర్లు చెబుతారు. మాకు తెలిసి రెండు టెస్టులకు అందుబాటులో ఉండలేనని సమాచారం ఉంది. మిగతా మూడు టెస్టులకు కోహ్లి ఉండేది లేనిది రెండ్రోజుల్లో తెలుస్తుంది’ అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
అది కిషన్ నిర్ణయం! : యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జాతీయ జట్టుకు దూరం కావటంపై పలు కథనాలు వెలువడ్డాయి. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్థాంతరంగా స్వదేశం చేరుకున్న కిషన్ ఇటు దేశవాళీ క్రికెట్‌లో కనిపించటం లేదు. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ‘విరామం కావాలని కిషన్ కోరుకున్నాడు. రీ ఎంట్రీకి ముందు దేశవాళీలో మ్యాచ్ ప్రాక్టీస్ నిరూపించుకోవాలని సూచించాం. కిషన్ ఇంకా దేశవాళీలో ఆడటం లేదు. జట్టు మేనేజ్‌మెంట్ కిషన్‌తో టచ్‌లోనే ఉంది. అతడు ఎప్పుడు రావాలని అనుకుంటే అప్పుడు క్రికెట్ మొదలుపెట్టవచ్చు. విరామం పూర్తిగా కిషన్ నిర్ణయమే’ అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.