
నవతెలంగాణ -పెద్దవంగర: గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తహశీల్దార్ వీరగంటి మహేందర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు దరఖాస్తుదారుల ఇండ్లను సందర్శించి క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సొంత స్థలం ఉన్న లబ్ధిదారులై ఉండాలన్నారు. గ్రామాల్లో బండల ఇళ్లు, రేకుల ఇళ్లు, పూరి గుడిసెలు, ఎడ్ల కోట్టాలు, ఖాళీ స్థలాలు ఉంటే దరఖాస్తు చేసుకున్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో టీంలుగా ఏర్పడి గృహలక్ష్మి దరఖాస్తులను స్థానికంగా పరిశీలించి అవకతవకలు లేకుండా ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మండల కార్యాలయంలో నివేదికలు పంపించాలని సూచించారు. పరిశీలనకు వచ్చే అధికారులకు లబ్ధిదారులు ఆధార్, రేషన్, ఓటరు ఐడీ కార్డులు, ఇంటి పన్ను రశీదులు, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలను చూపించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ భూక్యా లష్కర్, పంచాయతీ కార్యదర్శులు వెంకన్న, గీత తదితరులు పాల్గొన్నారు.