నీతి అయోగ్‌ యాస్పిరేషనల్‌ బ్లాక్‌గా గుండాల మండలం ఎంపిక

– కలెక్టర్‌ ప్రియాంక అలా
– నీతి అయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం వెల్లడి
– అభివృద్ధికి ప్రధానమంత్రి ఆర్థిక సంఘ నిధులు
నవతెలంగాణ-పాల్వంచ
నీతి అయోగ్‌ యాస్పిరేషనల్‌ బ్లాకుగా గుండాల మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కార్యాలయం మినీ సమావేశం హాల్లో గుండాల మండలాన్ని యాస్పిరేషనల్‌ బ్లాక్‌గా ఎంపిక సందర్భంగా ఢిల్లీ నుండి నీతి అయోగ్‌ సీఈవో సుబ్రహ్మణ్యం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం గుండాల మండలం పంచాయతీరాజ్‌ వైద్య మహిళా సంక్షేమ విద్య టీఆర్‌డీఏ మిషన్‌ భగీరథ సాంఘిక సంక్షేమ వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలం అభివృద్ధి కోసం నీతి అయోగ్‌ నేరుగా ప్రధానమంత్రి ఆర్థిక సంఘం నిధులు జిల్లా కలెక్టర్‌కు పంపనున్నట్లు చెప్పారు. చేపట్టాల్సిన 39 అంశాల పై మూడు రోజుల్లో నివేదికల సిద్ధం చేయాలని ఆదేశించారు. గుండాల మండలంలోని 11 గ్రామపంచాయతీలకు అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యచరణ నివేదికల సిద్ధం చేయాలని చెప్పారు. యాస్పిరేషన్‌ అంశాలపై వచ్చే వారంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు కేటాయించిన విధంగా పారామీటర్లు ప్రతినెల 7వ తేదీ వరకు పరిశీలన చేసి జిల్లా అధికారులు అప్లోడ్‌ చేయాలని చెప్పారు. నివేదికలు పంపుటలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యత్యాసం రాకుండా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శిరీష, జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్‌, మహిళా శిశు సంక్షేమ అధికారి లేనైనా, ఏడీఏ లాల్చంద్‌ తదితరులు పాల్గొన్నారు.