ఆత్మవిశ్వాసం

self confidenceమనం ఏ పని చేయాలన్నా ముందు ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. ఇది ఉండేలా గానీ దేన్నైనా సాధించగలం అనే నమ్మకం వస్తుంది. వ్యక్తిగత విషయాల్లో అయినా… వృత్తిలో అయినా ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంత మందిలో ఇదే లోపించి ఏ పనిని సరిగా చేయలేకపోతుంటారు.
ఆత్మ విశ్వాసంతో ఉండాలంటే మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవద్దు. ఎందుకంటే జీవితం అనేది పోటీ కాదు. ఎవరి జీవితాలు వారివి. ఒకరి స్థితిగతులు ఎలా ఉంటాయనేది వారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోవడం మానేయాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అసూయ ఏర్పడటం సహజం. దాని వల్ల వ్యక్తులు తమకు తాము తక్కువ చేసుకోవడంతో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.
అలాగే మంచి మనుషులతో సాంగత్యం కూడా చాలా ముఖ్యం. మనం ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నామో గుర్తిస్తే మనమేంటో అర్థమవుతుంది. మంచి వ్యక్తులు… సానుకూల దృక్పథంతో ఉండేవారు, మన మంచి కోరే వారితో సన్నిహితంగా మెలగడం అలవాటు చేసుకోవాలి. వారి ప్రభావం మనపై కొంతైనా పడుతుంది. కాబట్టి వారి మాటలు, చర్యలు మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. ఎవరైనా చెడువైపు లాగాలని ప్రయత్నిస్తే వారితో స్నేహానికి గుడ్‌బై చెప్పేయడం కంటే ఉత్తమమైన పని మరొకటి లేదు.
మరొక ముఖ్య విషయం ఆరోగ్యం బాగుంటేనే ఏమైనా సాధించగలం. ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు కొండంత బలం మాత్రమే కాదు మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతుంది. నిత్యం హుషారుగా ఉండేవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, పోషకాహారం తింటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుకోవడం చాలా అవసరం. దీని వల్ల క్రమంగా మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే మీ వల్ల ఓ పొరపాటు జరిగితే దాన్నే తలచుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. మీ తప్పులను మీరే క్షమించుకోండి. మరోసారి అలా జరక్కుండా చూసుకోవాలని బలంగా సంకల్పించుకోండి. దీని వల్ల మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మరీ ముఖ్యంగా నా వల్ల కాదు, అసలు చేయగలనా? ఇది అసాధ్యం వంటి మాటలు మీ నోటి వెంట రాకుండా చూసుకోండి. అలాంటి మాటలు మిమ్మల్ని మరింత కుంగదీస్తాయి. దేన్నైనా నేను సాధించగలను అనే భావనతో ఉండాలి. నేను చేయగలను.. సాధించగలను అని మీకు మీరే తరచూ చెప్పుకుంటూ ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మరో విషయం భయం. ప్రతి మనిషికి కొన్ని భయాలు ఉండటం సహజం. కానీ, ఆ భయాలను జయిస్తేనే విజయాలు దక్కుతాయి. సవాలు ఎదురైతే భయపడి దాని నుంచి తప్పుకునే ప్రయత్నం చేయొద్దు. సవాల్‌ను ఎదుర్కోండి. తొలి ప్రయత్నంలో ఓడినా భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. దీంతో భవిష్యత్తులో విజయాలను అందుకునే ఆస్కారముంటుంది.