– ఆరెస్బీ
కొందరికి సీటొచ్చేదాకా ఒకెత్తు.. తీరా సీటొచ్చిన తర్వాత గెలవడం మరొకెత్తు! గెలిచిన తర్వాత తాను పోటీ చేసిన పార్టీ అధికారంలోకి రావడం రాకపోవడం మరో కీలకాంశం. లేకుంటే ఇంత ఖర్చూ పెట్టి గెలిచింది వేస్ట్ అవుతుంది కదా అని వారి ఆందోళన! మరికొన్ని కోట్లు తనవి కాదనుకుంటే మంత్రి పదవి దక్కి, మరిన్ని కోట్లకు మార్గం ‘ఖుల్‌జా సెసేమ్’ అనకుండానే తెరుచుకుంటుందని దశాబ్ద కాలం పాటు అనుభవించిన వారికి ఒక అడియాశ! ఇన్‌ఫ్లేషన్ వల్ల రేట్లు పెరిగే మణులు మాణిక్యాలపై వారికి పెద్దగా ఆశల్లేవు. డబ్బు ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు కావాలని, ఉన్నవి ఇంకా పెరగాలని వారి ఆశ! అన్ని దానాల్లోకి విద్యా ‘దానం’ గొప్పదన్నారు కాబట్టి చదువు’కొన’డానికి మార్గం సుగుమం చేసే ఈ ప్రక్రియ వల్ల ‘ఇహ, పర’ సుఖాలు దక్కే మార్గం ఉంటుందని పేరాశ ఉండే వారికి కొదవేమీ లేదు.
ఎందుకంటే, కొన్ని ‘ఆత్మ’లకు అనుభవాలెక్కువ. అందుకు కారణం వారు తెలంగాణ పేరుచెప్పి అనుభవించిన సౌఖ్యాలు అంత తొందరగా మరిచిపోయేవి కావు. ముందు కాన్వారులు, ఎర్ర బుగ్గ కార్లు విలాసవంతమైన నివాస సౌధాలు ఇన్నేళ్లు అనుభవించి ఒక్కసారే లేకుండా పోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. గిరీశం ”ఆత్మానందమైతేనే తత్వం బోధపడుతుంద”న్నదందుకేగా. బాకీ వసూలు చేసుకోడానికొచ్చిన బంట్రోతు ముందు చెవిటి వానిగా నటించి, ఆ తర్వాత జంధ్యప్పోస పట్టుకుని ప్రమాణం చేసి అతడ్ని నమ్మించాకే ఆలోచించి ‘మన వాళ్లు’ ”ఓల్డ్ కష్టమ్స్ అన్నిటికీ ఏదో ఒక ప్రయోజనం ఏర్పరిచార”నే తత్వం బోధపడింది. కాబట్టి ఇవన్నీ ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన అంశాలు.
బీఆర్‌ఎస్‌లో అయితే అధినాయకుడ్నీ, మహా అయితే త్రిమూర్తులను, స్త్రీ ద్వేష దోషం అంటకూడదనుకుంటే చతుర్ముఖ పారాయణం (పేకాట కాదు) చేయడం, కాంగ్రెస్ అయితే అష్టాదశ దేవతామూర్తులను కీర్తించడం షరామామూలే! ఒక్క బీజేపీనే దీనికి మినహాయింపు. వాజ్‌పేయిలు, అద్వానీలు, ఇంకా వెనక్కెళ్లి శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ లాంటి వారి బొమ్మలేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. డీఆర్‌డీఓ సర్క్యులర్‌ను, యూజీసీ సర్క్యులర్‌ను అమలు చేస్తే చాలు. ఆ ఒకే ఒక్కడి బొమ్మ పోస్టర్‌పైనైన, మనసులోనైనా ముద్రించుకుంటే సదరు వ్యక్తి జన్మ చరితార్థమైనట్టే!
కొన్నింటిని బండలనుకుని విసిరివేయద్దు. విరగకొట్టొద్దు. ఆ బండల్లో ఆత్మలుంటాయి. అంతరాత్మలూ ఉంటాయి. ఒక జిల్లాలో అన్ని సీట్లూ గెలిపించుకున్న ఒక ఎక్స్ గులాబీ మంత్రి మీడియాతో చతురోక్తులాడుతూ ‘పురజనుల’ కోరిక మేరకు తాను మళ్లీ ‘మంత్రావతారం’ ఎత్తచ్చని ఆశ వెలిబుచ్చాడు. పైగా భగవాదేశం కూడా ఆ విధంగానే ఉందని కూడా చెప్పుకొచ్చాడు. దీనికి రెండర్థాలున్నాయని మీడియాలో చర్చ నడిచింది. ఒకటి, రాజాసింగ్ శాపం! నాల్రోజుల్లో ఆ ప్రభుత్వం కూలిపోతే బీజేపీ, మరికొందరు ‘జిలానీ’లు సాయం చేస్తే మళ్లీ బీఆర్‌ఎస్ కత్తికే భాష్యం కట్టించేసేస్తే ‘నువ్వా, నేనా?’ అనే గొడవ లేకుండా భరతుడు పాదుకలతో రాజ్యం చేసినట్టు చేయవచ్చు. అపుడు తనకు మంత్రి పదవి దొరకవచ్చు అనే ఆశ కావచ్చు. రెండవది మనందరికీ తెల్సిన మరో పద్ధతిలోనూ ఈయన ప్రమాణ స్వీకారం జరుగచ్చు.
‘ఆస్మాసిస్’ అనేది ఒక సైన్స్ ప్రక్రియ. మొక్కల వేళ్లలోకి నీరు ఎలా ప్రవేశిస్తుందో జరిగిన పరిశోధనలో తేలిన అంశమేమంటే చిక్కటి ద్రావకంలోకి పల్చటి ద్రావకం ప్రవహిస్తుందని నిరూపితమయిన ప్రయోగం. దాన్ని రాజకీయాలకు వర్తింపజేస్తే అధికారం ‘చిక్కటి’ ద్రావకం. ఇతర పార్టీల్లో నుండి దీన్లోకి ప్రవహించేలా చేయడం సులభం. గతంలో జరిగిందిదే. కరుడుగట్టిన మతవాదియైన ఓ బీజేపీ ఎమ్మెల్యేకు, ఆయన పార్టీకి సైన్స్ తెలియకపోవడం వల్ల ‘రివర్స్ ఆస్మాసిస్’ గురించి కలలు కంటున్నారు. ఈశాన్య భారతమంత బలహీనంగా తెలంగాణ లేదని, ఉండదనే విషయం ఆయనకెవరైనా సమ్జాయించిజెప్పాలి. కింద నుండి చీల్చడం సాధ్యమయ్యే పనికాదని మిగిలిన ఈ ఒక్క ‘ఆర్’కి తెల్సెదెలా?