
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14 బాలల దినోత్సవం పురస్కరించుకొని తిరుమలగిరి మండలం ఆదర్శ పాఠశాల (అనంతారం) లో గురువారం విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక్కరోజు ప్రిన్సిపాల్ గా శ్రీ చరణ్, కలెక్టర్ గా ప్రదీక్ష, జాయింట్ కలెక్టర్ గా అశ్విత,అడిషనల్ డైరెక్టర్ గా సుమన శ్రీ, ఆర్ జెడి గా నందిని, డీఈఓ గా పూజిత, డిప్యూటీ డిఈఓ గా రేష్మ, ఎం ఈఓ గా నందిని,మరో 50 మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటివి ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువుల కృషి వెలకట్టలేనిదన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏది ఉండదని, చిన్ననాటి నుండి లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలన్నారు. ఒక్కరోజు విధులు నిర్వహించిన విద్యార్థులు మాట్లాడుతూ.. ఒక్కరోజు ఉపాధ్యాయులుగా అధికారులుగా చేయడం చాలా గర్వంగా ఉందని ఆనందాన్ని తెలిపారు. పాఠ్యాంశాలు బోధించడం గురువులకు మాత్రమే సాధ్యమని పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేయడం ఓ వరం అన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఉపన్యాసాలు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.